నవతెలంగాణ- చిన్నకోడూరు: సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి హరీష్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, ఎంపిపి మాణిక్య రెడ్డి అన్నారు. చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ గ్రామంలో బీఆర్‌ఎస్ సిద్దిపేట శాసన సభ అభ్యర్థి హరీష్ రావు పక్షాన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఫలాలు ప్రతి గడపకు చేరాయన్నారు. ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పే నాయకుల మాయ మాటలు నమ్మవద్దని, నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పరితపించే నాయకులను ఎన్నుకోవాలని కోరారు.10 ఏండ్లలోనే బీఆర్‌ఎస్ హయాంలో ఊహించని అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచామని.. తెలంగాణలో అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటుతో రైతులు సంతోషంతో వ్యవసాయం చేస్తున్నారన్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గంటలు కూడా విద్యుత్తు ఇవ్వడం లేదన్నారు. బీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారని, 60 ఏళ్లు నమ్మి ఎంతో గోసపడ్డారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రిని హరీష్ రావు ఏర్పాటు చేశారని, అత్యవసర సమయంలో ప్రజలు హైదరాబాద్ పోయే ఇబ్బందులు తప్పినట్లు చెప్పారు. ఆపదలో ముందుండి నేనున్నానంటూ భరోసానిచ్చే హరీష్ రావును ఏడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు. డిసిసిబి డైరెక్టర్ రామచంద్రం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంటయ్య, సొసైటీ చైర్మన్లు సదానందం, కనకరాజు, సర్పంచులు నెమలి సుభాష్, చంద్రకళరవి, ఎంపిటిసి దుర్గారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.