నవతెలంగాణ-మునిపల్లి
మండలంలోని అంతారం గ్రామంలో గల ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నదని స్థానికులు వాపోతు న్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయిన మండల తహసీల్దార్‌కు విన్నపించి నప్పటికీ పట్టించుకోవడం లేదని కాలనీకి చెందిన జంగం నవీన్ కుమార్ ఆరోపించారు. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్ దష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. అధికారులు మొక్కుబడిగా ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసినప్పటికీ అవి సరిపోడం లేదన్నారు. చాలా దూరానికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అంతారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. అంతారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి అవాస్తవమన్నారు. కంకోలులో రెండు చోట్ల ప్రధాన వాటర్ సప్లయి పైపులైను పగిలిపోవడం వలన నీటి సరఫరాలో రెండు రోజులు జాప్యం జరిగిందన్నారు. ఇందుక ుగాను రోజూ మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించామన్నారు. అంతేకాకుండా ఎస్సీ కాలనీ వైపు వెళ్లే పైపులైను వద్ద పెద్ద గేటు వాల్ నిర్మించామని ప్రతి ఇంటికి నీటి సరఫరా అయ్యే విధంగా చూశామన్నారు. నీటి ఎద్దడి మాట సత్య దూరమని ఖండించారు.