పంటలు ఎండిపోతున్న ప్రాజెక్టుల ద్వారా నీళ్లు విడుదల చేయరా

– యాసంగి పంటలకు కొండపోచమ్మ కాలువల ద్వారా నీళ్లు అందించాలి.
– సాగునీటి కోసం రోడ్డుపై ధర్నా చేసిన రైతులు.
నవతెలంగాణ-దౌల్తాబాద్ : యాసంగి కాలంలో వేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని అయినా గాని ప్రభుత్వం నిమ్మకు నీరు వచ్చినట్లు కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువ ద్వారా వ్యవసాయ పంటలకు నీళ్లు అందించడం లేదని ఆగ్రహం చెంది రైతులు గజ్వేల్ రామాయంపేట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గురువారం దౌల్తాబాద్ మండలం హైమద్ నగర్ గ్రామం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామాలలో పంటలు, చెరువులు  ఎండిపోతున్నాయని ముబారస్ పూర్, మల్లేశం పల్లి, హైమద్ నగర్ గ్రామాల రైతులు ఉప్పరపల్లి కెనాల్ వద్ద ధర్నా నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ,కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిదానాలు చేస్తూ రైతులు రోడ్డుపై బైటాయించి చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. సాగుచేసిన పంటలు కళ్ళేదుటే ఎండిపోతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసరెడ్డిలు స్పందించి కొండపోచమ్మ ద్వారా ఉప్పరపల్లి కెనాల్ కాల్వ ద్వారా చెరువులు నింపి పంటలకు నీరు అందించాలన్నారు. రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో కాలువ ద్వారా చెరువులు నింపి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు భరోసా కల్పించడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల రైతులు పాల్గొన్నారు.