నీరు…కన్నీరు

Water...tears”యాద్‌గిరీ విన్నావా, త్వరలో సముద్రం మన హైదరాబాదు సిటీలో ప్రవహిస్తుందట” అని దస్తగిరి అంటూ ఉంటే దాన్ని మధ్యలో ఆపి అందుకున్నాడు యాద్‌గిరి
”అరే సముద్రమెక్కడన్నా ప్రవహిస్తుందా, ఉన్నచోటే ఉంటుంది” అని సమాధానమిచ్చాడు. అయినా దస్తగిరికి మనసులో ఏదో అసంతృప్తి.
”అది కాదు యాదన్నా, మన నాయకుడు సముద్రంలో భాగమడిగాడు కదా, ఒకవేళ ఇచ్చారే అనుకో అప్పుడు సముద్రం మన ఎత్తిపోతల పథóకాల్లా మనకు రాదూ?” అనేసరికి యాద్‌గిరికి ఇంకా కోపమొచ్చింది.
”ఓ నా పిచ్చి దస్తగిరి, ఆ ఉప్పునీరు తెప్పించుకొని మనమేం చేస్తాం చెప్పు? ఆ సముద్రం మీద చేసుకునే వ్యాపారంలో మనకూ వాటా అడిగాడురా మన ముఖ్యమంత్రి” అనేసరికి,
”అంతేనంటావా నేను సముద్రమే మనకొస్తుందను కుంటున్నా ”
”అలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసుపాడు చేసుకోవద్దు కాని, ఆ సముద్రంలో ఎంత నీరు వృథాగా పోతోందో దానిమీద పెట్టు దృష్టి” యాద్‌గిరి
”….???” దస్తగిరి
”అదిగో పులి అంటే ఇదిగో తోక అనేవిధంగా ఉండొద్దు దస్తగిరీ. జర ఆలోచన చేయి. నిజంగా మనకేమి కావాలి? మనకేమి ఇస్తున్నారు ఈ నాయకులు అన్నది చూడు. అప్పుడన్నీ క్లియర్‌గా వినిపిస్తాయి, కనిపిస్తాయి”
”సరే యాదన్నా…..”

నాలుగు రోజుల ముందు పేపర్లో వచ్చిన ”చంద్రుడిపై నీరు” అన్న వార్త బాగా ఆకర్షించింది. నిజం చెప్పుకోవాలంటే ఆ నీటిని మొదట ఆకర్షించింది మన భూమి. కొన్ని కోట్ల సంవత్సరాలు గడ్డకట్టి ఉన్న ఆ నీరు ఏర్పడ్డాకనే ఇక్కడ జీవం మొలకెత్తింది. ఏక కణ జీవులు, బహుకణ జీవులైన అమీబాలు, హైడ్రాలు, మాసు, ఫెర్ను లాంటి మొదటి తరం మొక్కలు ఈ నీటివల్లే జీవం పోసుకున్నాయి. ఈ సృష్టినంతా భగవంతుడు సృష్టించాడు అన్నది ఆ నీటి చరిత్ర చూస్తే మనకు తెలిసిపోతుంది.
‘నీరు పల్లమెరుగు నిజం రాజకీయం ఎరుగు’ అని పాత సామెతల్ని, జాతీయాల్ని తిరగరాయాల్సిన సమయం. నిజంగానే నీటికి పల్లమెటో తెలుసు కాబట్టి సముద్రంలోకి పోతూనే ఉంటుంది. కీచులాడుకునే అన్నదమ్ములు పిల్లులు రొట్టె కథలో లాగ, నాకెక్కువ కావాలని కోతి దగ్గరికి పోయినట్టు కేంద్ర సంస్థల దగ్గరికి పోయి మొరపెట్టుకుంటే వాళ్లు స్పందించేలోపు సముద్రుడు మంచి నీటిని తనలో కలిపేసుకునే ఉంటాడు. భూమి మీద ఉన్న నీళ్లని సరిగ్గా వాడుకోవడం చేత కాదు కాని అక్కడెక్కడో మన ఉపగ్రహం చంద్రుడి మీద, ఇంకో గురుగ్రహం మీద నీళ్లున్నాయా అని పరిశోధనలు చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఐతే మన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమాచారము, విషయ పరిజ్ఞానము కూడా మనిషికి అవసరమే. అయితే మొదట మన భూ గ్రహాన్ని కాపాడుకోవడం కూడా భూమిమీద బతుకుతున్న మనందరిదీ. ముఖ్యంగా అన్ని దేశాల ప్రభుత్వాలది, నాయకులది.
నదుల నీటిని సరిగా వాడుకోలేక పోయిన నాయకులను ఇంతకుముందు చూస్తే, ఆ సముద్రంలో నాకూ భాగముందని అరిచే నాయకుల ”గొడవ” నేడు చూస్తున్నాం. నిజంగా అంత జాతీయతా భావం చూస్తే సంబురమేస్తుంది మనసులో. అలాగే ఫలానా గుళ్లో, దాని ఆదాయంలో తమ్ముడిగా వాటానడిగితే అవతలినుండి చార్‌మీనారు, నీ దగ్గర ఉన్న దేవుడి గుళ్లు, హైటెక్కు సిటీ, రవీంద్ర భారతి ఇలా చిట్టా ఇచ్చి వాటిలో నా వాటా కూడా తేల్చు అనే ప్రమాదముంది. కాస్త వాళ్ల గొడవ కూడా చూడాలి నాయకుడంటే. ఈపాటికే హైటెక్కు సిటీ కట్టించింది నా ముందు చూపేనని పెద్దాయన అంటూనే ఉంటాడు. ఇలా ఈ చర్చలు జరుగుతూనే ఉంటాయి, వర్షాలు పడుతూనే వుంటాయి, నదులు పారుతూనే ఉంటాయి, సముద్రం మన నాయకుల మూర్ఖత్వం చూసి నవ్వుతూనే ఉంటుంది. అప్పుడు నీరు కాదు, కన్నీరే మిగిలేది. వర్షాకాలంలో నీరు పారినట్టు, ప్రవాహంలా మారినట్టు ఎన్నికలప్పుడు కూడా వరదలా మాటలు ఎగిసిపడతాయి, మర్యాదల ఆనకట్టలు దాటి ప్రవహిస్తాయి. తరువాత అంతా ఉత్తుత్తిదే అన్నట్టు.
”కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు” అని అంతులేని కథ చిత్రంలో ఆత్రేయగారు రాసిన పాట ఎలా ఉన్నా ఇప్పుడు సముద్రంలో కలుస్తున్న నీటి లెక్కలు మాత్రం నాయకులకు బాగా తెలుసు. ఒక పక్క భూమి వాతావరణం వేడిక్కి పోతుండంటూనే ఇలా వృథాగా పోతున్న నీటితో ఎన్ని చెట్లు నాటచ్చునన్న విషయం కూడా లెక్కవేసి చూసుకోవచ్చు. కానీ ఆ విషయం రాజకీయ లెక్కలముందు తేలిపోతోంది. అదే సమస్య. ఒక సమస్య బబుల్‌గంలా సాగుతూ ఉంటేనే వాళ్ల రాజకీయ జీవితం సాగుతూ ఉంటుందన్నది వాళ్లెరిగిన సత్యం.
ప్రజలకు తెలిసిన సత్యాలు కొన్ని ఉంటాయి. వాళ్ల బాగు అంటే ప్రజలందరి బాగు కోరుకుంటారు. వీళ్లు పోతే వాళ్లు, వాళ్లు పోతే ఇంకొకరు అని మంచి చేసేవారు రాకుండా ఉంటారా అని వేచి చూసే దాతృత్వం ప్రజలది. అలాగని వాళ్లను విస్మరించి తమ ఇష్టమొచ్చినట్టు ఆడితే వాత ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతారు. కీలెరిగి వాత పెట్టడం కూడా వారికి తెలుసు.
– జంధ్యాల రఘుబాబు, 9849753298.