
జలమే జీవనాధారం.. జలము లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు.. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అంతటి ప్రాధాన్యత కలిగిన జల ప్రాముఖ్యతను తెలుపుతూ బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని సన్నూరు గ్రామంలో ప్రపంచ జల దినోత్సవం నిర్వహించారు. 170 మంది విద్యార్థులతో, గ్రామస్తులతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నీటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బాలవికాస సంస్థ ప్రతినిధి రమ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ నీటిని సక్రమంగా వినియోగించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటివి ప్రతి ఒక్కరూ చేయాలన్నారు. రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి అనడంలో ఎలాటి అతిశయోక్తి లేదు అన్నారు. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే నేటి ప్రాముఖ్యతను తెలుపుతూ బాలవికాస ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.