రైతుల ఆశలపై నీళ్లు

Water on the hopes of farmers– పాలమూరు సభతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాలమూరు సభ ద్వారా వరాల వర్షం కురిపిస్తారని ఎదురు చూసిన రైతుల ఆశలపై కాంగ్రెస్‌ సర్కార్‌ నీళ్లు చల్లిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుబంధు, రూ.2లక్షల పైచిలుకు రుణ మాఫీ తదితర పథకాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆరోపించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఈ ఏడాది దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం పండిందని అన్నారు. సగటున క్వింటాళుకు రూ.500 చొప్పున రూ.35 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.30 కోట్లు మాత్రమే చెల్లించారని అన్నారు. బోనస్‌ను ఎగ్గొట్టేందుకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతుండటంతో రైతులు విసిగి వేసారి వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రైతుబంధును ఎగ్గొట్టేందుకు వ్యవసాయ శాఖా మంత్రి ద్వారా సర్కారే లీకులు ఇస్తున్నదని ఆరోపించారు.
”ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం మాట్లాడుతున్నారు. అడ్డుపడితే తొక్కుకుంటా పోతా అంటున్నాడు … నిధులివ్వమంటే మంత్రులను తొక్కుకుంటూ పోతా? భూములివ్వని రైతులను తొక్కుకుంటూ పోతా? హామీలు అమలు చేయాలని అడిగితే ప్రజలను తొక్కుకుంటూ పోతా? ఈ బెదిరింపు భాష ఏంటి ? సీఎం వెంటనే తన భాష మార్చుకోవాలి” అని హితవు పలికారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి దాన్ని ముందు తన సొంత గ్రామంలో నెలకొల్పాలని సూచించారు. సీఎం కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక కొండారెడ్డి పల్లిలో ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అప్రకటిత నిర్భందం కొనసాగుతోందని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరహక్కుల గురించి మాట్లాడే నేతలు ఎక్కడి పోయారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి పంతాలకు పోకుండా ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు.