పానగల్ రిజర్వాయర్ నుంచి డి-39 కాలువకు నీటి విడుదల..

నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
పానగల్ రిజర్వాయర్ నుంచి డి-39 కాల్వకు గురువారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డీఈ ఆంజనేయస్వామి మాట్లాడుతూ పానగల్ రిజర్వాయర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల ద్వారా గ్రామాలలో చెరువులను నింపడం జరుగుతుందని తెలిపారు.చెరువులను నింపడం ద్వారా గ్రామాలలో సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య లు మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువలలో పూడిక, కంపచెట్లు ఉండడంతో రైతులు ఈ సమస్యను ఇటీవల మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి తన సొంత ఖర్చులతో ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా పూడికతీత పనులను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.ఈ పూడికతీతతో కాలువల చివరి భూముల వరకు రైతులకు సాగునీరు అందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు,తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఏఈ హలీం, ఖాజీరామారం మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా, కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.