ఉపాధి హామీలో నీరు, నీడ, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి

వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
నవతెలంగాణ-దామరచర్ల
ఉపాధి హామీ పని ప్రదేశాలలో నీరు, నీడ, ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంతో పాటు కొండ్రపోలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుఎండలో మాడ పగిలే పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు పనిచేసే చోట కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి కార్మికుల్ని గాలికి వదిలేసిన దుస్థితి దేశంలో ఏర్పడిందని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాలలో ఉపాధి పనులు కల్పించడం లేదని దీని ఫలితంగా ఉపాధి పనులు మున్సిపాలిటీలో ఉన్న కార్మికులు కోల్పోయారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో కలిచిన గ్రామపంచాయతీలకు కేరళలోని వామపక్షం ప్రభుత్వం మాదిరిగా పట్టణ పేదలకు ఉపాధి పనులు పెట్టడం కోసం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేవాలన్నారు. రోజుకు రెండుసార్లు ఫోటోలు అప్లోడ్‌ చేసే ఎన్‌ఎంఎంఎస్‌ రద్దు చేయాలని, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు, పనిముట్లు, ఆటో చార్జీలు, సమ్మర్‌ అలవెన్స్‌, మెడల్‌ మెడికల్‌ కుట్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పని చూపని దగ్గర జాబు కార్డుదారులకు చట్ట ప్రకారం నిరుద్యోగ భతి చెల్లించాలని, చేసిన పనులకు వారం వారం వేతనాలు ఇవ్వాలని, అలాగే ఉపాధి హామీ పని దినాలు ప్రతి మనిషికి 200 రోజులకు పెంచి ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్‌ 5న కలెక్టర్‌ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, పిల్లుట్ల సైదులు, జిల్లా నాయకులు బొడ్డు బాల సైదులు, సంఘం దామరచర్ల మండలం అధ్యక్షులు, పాక గోప,ి కార్యదర్శి అందుగుల హనుమంతు, ప్రజాసంఘాల నాయకులు వినోద్‌ నాయక్‌, పాపానాయక్‌, దయానంద్‌, కొండ్రపోలు గ్రామ అధ్యక్షులు పరంగి సైదులు, కార్యదర్శి పరంగి కవిత , ఉపాధి కార్మిక సంఘ నాయకులు టంగుటూరి అరుణ, పరంగి విజయ, నూతి లక్ష్మి, ఆదిమల్ల సైదులు, ఎనుగుల సతీష్‌, నూతి దుర్గ, నక్క సైదులు, యార్ల పద్మ, ఘనపురి శ్రీను, పగిడి వెంకటేశ్వర్లు, ఖమ్మం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
సైదులుపై దాడి చేసిన ఎస్సైని సస్పెండ్‌ చేయాలి
అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా మోతే మండలం విభాలాపురం గ్రామంలో నిరసన తెలియజేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులుపై, పేదలపై అకారణంగా దాడి చేసిన మోతే ఎస్‌ఐ మహేష్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్న మట్టి పెళ్లి సైదులు, ఇతర నాయకులపై అధికార పార్టీ నాయకుల సూచన మేరకు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. మోతే ఎస్సై మహేష్‌ అధికార ఒక పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు. మోతే ఎస్సైపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సస్పెండ్‌ చేసేంతవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు.