నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని వెంటనే విడుదల చేయాలి

నవతెలంగాణ-నేరేడుచర్ల
నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని సీపీఐ(ఎం)ం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌ రావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనెల 8వ తారీకు నుండి 16వ తారీకు వరకు సాగర్‌ నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం ద్వారా కాల్వల చివరి భూములకు నీరు అందక వరి పైరు ఎండిపోతుందని పొట్ట దశలో ఉన్న వరి కి నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని ఆయన కోరారు. రైతులు ఈ వానాకాలంలో బోర్లు బావులు ద్వారా వరి నాట్లు వేసుకున్నారని తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులు నీళ్లు లేక పైరు ఎండిపోతుందని ప్రభుత్వం చెబుతున్న విధంగా 10 గంటలు కరెంటు వరుసగా రాకపోవడం ద్వారా పారిన పొలం వరి మళ్ళీ పారి కిందికి నీరు దిగక వరి ఎండిపోతుందని అన్నారు. పూర్తిస్థాయిలో పెట్టుబడి పెట్టిన రైతుకు వరి పొలం ఎండిపోయి దిగుబడి రాకపోతే రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట చేతికి వచ్చే వరకు సాగర్‌ నీటిని పూర్తిస్థాయిలో వదిలి పంటను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కొదమ గుండ్ల నగేష్‌ సిపిఎం నాయకులు పాతూరి శ్రీనివాసరావు కుంకు తిరుపతయ్య మర్రి నాగేశ్వరరావు గుర్రం యేసు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.