కొండపాక మండలానికి నీటిని విడుదల చేయాలి

కొండపాక మండలానికి నీటిని విడుదల చేయాలినవతెలంగాణ-కొండపాక
కొండపాక మండల రైతుల పంట పొలాలకు తపాస్‌పల్లి డి 4 కెనాల్‌ కాలువ నీటిని అందించేలా ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మడుపు భూమ్‌ రెడ్డి అన్నారు. తపస్‌పల్లి నుంచి కొండపాక మండలానికి వచ్చే డి 4 కాలువను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యాసంగి పంట చేతికి రావాలంటే కాల్వల ద్వారా చెరువులలోకి సాగునీరు అందకపోతే పంటలు పండగ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. యాసంగి నాట్ల మొదలు దశలోనే అరా కొరా సాగు చేస్తే కోతల దశలో కన్నీరు మిగిలేలా ఉందన్నారు . రైతులను కడుపులో పెట్టుకుని చూసేలా సిఎం రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోని పదకొండు గ్రామాలకు 2011లో సాగునీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం తపస్‌పల్లి రిజర్వాయర్‌ ద్వారా డి 4 కెనాల్‌ పేరుతో కాలువ నిర్మాణాలు చేపట్టి తాగునీటి సరఫరా చేసి ఆయా గ్రామాల చెరువులను నింపారన్నారు. వేసవిలో సైతం నిండు కుండల చెరువులు ఉండేవన్నారు. దాంతో పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పర్యావెక్షణలో ప్రతి గ్రామానికి సాగునీరు అందించారన్నారు. కొద్ది రోజులుగా కాలువలను ఎవరు పట్టించుకోక పోవడంతో గండ్లు పడి, పూడికలు నిండి నీటి పారుదలకు అంతరాయం ఏర్పడినట్లు రైతులు ఆయన దష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సాగునీరు సరైన విధంగా అందక ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దష్టిలో పెట్టుకొని వెంటనే కాలువల ద్వారా నీరు అందించే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. మండలంలోని నీరు అందాలంటే కొమురవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామ శివారులలో ఉన్న పూడికతీత పనులను అధికారులు వెంటనే పరిశీలించి ప్రారంభించాలని కోరారు.