జలపాతాలు

జలపాతాలుపుస్తకాలు చిన్ని గుంతలు కావొచ్చు
పెద్ద చెరువులు కావొచ్చు
అందమైన సరస్సులు కావొచ్చు

పుస్తకాలు, ప్రవహించే
నదులు కావొచ్చు
గంభీరమైన
మహా సముద్రాలు కావొచ్చు

అపారమైన జలసంపదలాగా
విస్తారమైన
విషయ సంపద ఉండొచ్చు

కానీ, పనికిరాని
విషయ పరిజ్ఞానం లాగా
నీరంతా తాగడానికి పనికిరాదు

పొట్టుతీసి గింజలు ఏరుకున్నట్టు-
తొక్కతీసి పండు వొలిచినట్టు
మనిషి ప్రాణాన్ని నిలిపే
మనిషి మనిషిగా లేపే
విజ్ఞానపు జలం కోసం
సమాజపు బలం కోసం
తరం తర్వాత తరం, నిరంతరం
అన్వేషించుకుంటూనే ఉండాలి!

పుస్తకాల్లో దొరికే తడి, వేడి, ధార
పరుగు, ప్రవాహం, ఉత్తేజం, ఉద్వేగం
గుర్తించగలిగిన వారికే
అది హస్తగతమౌతుంది!

జలపాతాల నుండి,
విద్యుత్తును పుట్టించొచ్చునన్నది
తెలుసుకోవాలి.

(నేడు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌
ప్రారంభం సందర్భంగా)
– దేవరాజు మహారాజు