విద్యార్థి ఉద్యమ కెరటం ఎస్‌ఎఫ్‌ఐ

భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ)– మెస్‌, కాస్మోటిక్‌ చార్జీల పెంపు కోసం అవిశ్రాంత పోరాటం
– ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి
– సర్కారు బడులు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో వసతుల కోసం ఉద్యమం
విద్యార్థుల సంక్షేమం, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ). సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అధికారులు, అమాత్యులకు వినతిపత్రాలు సమర్పించడం వరకే పరిమితం కాకుండా సమరశీల పోరాటాలు నిర్వహించడంలోనూ ముందున్నది. సర్కారు బడులు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించాలని అనేక ఉద్యమాలను నిర్మించింది. విద్యార్థుల సమస్యలపై ఉద్యమ కెరటంగా ఎస్‌ఎఫ్‌ఐ గుర్తింపు పొందింది. వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్యఉద్యమాలను చేపట్టడంలోనూ ముందు నిలిచి ప్రత్యేకతను సంపాదించుకుంది. పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలంటూ అవిశ్రాతంగా పోరాడింది. విద్యార్థులను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్మించింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలను పెంచడానికి అంగీకరించింది. అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదానికి పంపించారు. ఇక ఉత్తర్వులు విడుదలవుతాయని విద్యార్థులందరూ ఆశించారు. కానీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో మెస్‌ చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీల పెంపు ప్రతిపాదన తాత్కాలికంగా నిలిచిపోయింది. వచ్చేనెలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఆచరణకు రావాల్సి ఉంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
2014 తర్వాత సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మెస్‌చార్జీలు తక్కువగా ఉండేవి. దొడ్డుబియ్యంతో అన్నం పెట్టే పరిస్థితి ఉన్నది. మెస్‌చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని 2014 నుంచి 2019 వరకు ఎస్‌ఎఫ్‌ఐ నిరంతర ఉద్యమాలు చేసింది. సైకిల్‌యాత్రలు, పాదయాత్రలు, అధ్యయన యాత్రలను నిర్వహించింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వేలాది మంది విద్యార్థులతో చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. 2015లో సన్నబియ్యం పథకాన్ని సీఎం కేసీఆర్‌
ప్రవేశపెట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాల ఫలితంగానే 2016లో మెస్‌చార్జీలను పెంచారు. 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు రూ.32 నుంచి రూ.48కి, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.43 నుంచి రూ.59కి, 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.48 నుంచి రూ.61కి మెస్‌చార్జీలు పెరిగాయి. అయితే ధరలకనుగుణంగా పెంచా లని కోరుతూ మళ్లీ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్య మాలు జరిగాయి. చలో కలెక్టరేట్ల కార్య క్రమాన్ని నిర్వహించింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 30 శాతం మెస ్‌చార్జీలను పెంచుతున్నట్టు ప్రకటిం చింది. కానీ ఇంత వరకు జీవో ఇవ్వ లేదు. దీంతో అమలు కావడం లేదు.
గురుకులాలకు శాశ్వత భవనాల కోసం
తెలంగాణలో 293 గురుకులా లుండేవి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటి సంఖ్యను 1,002కు పెంచింది. వాటిలో 7,21,526 మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కొత్తగా 709 గురుకు లాలను ప్రారంభించింది. అయితే అవి అద్దెభవనాల్లోనే ఉండడం గమనార్హం. వనపర్తిలో కోళ్లఫారంలో, సత్తుపల్లిలో ఫంక్షన్‌హాల్‌లో, మిర్యాల గూడలో రైస్‌మిల్లులో గురుకులాలున్నాయి. అక్కడ ఉండే విద్యార్థులు అరకొర వసతులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుకులాలకు శాశ్వత భవనాలు కావాలనీ, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల ఫలితంగా 205 గురుకులాలకు సొంత భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. ఆ పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి.
జైలుకెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
సంక్షేమ హాస్టళ్లలో మెస్‌చార్జీలు, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని కోరుతూ ఉద్యమిస్తే పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, బాలరాజు సహా ఖమ్మంలో తొమ్మిది మంది, భద్రాద్రి కొత్తగూడెంలో ఆరు మంది 14 రోజులు జైలులో ఉన్నారు. ఉట్నూరులో నలుగురు నాయకుల మీద కేసులు పెట్టారు. బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు పెంచాలనీ, పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఉద్యమిస్తే ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌, హైదరాబాద్‌, సిద్ధిపేట, ఎల్లారెడ్డిపేట, సంగారెడ్డి, సూర్యా పేట, కరీంనగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులపై పోలీసులు తీవ్ర నిర్బం ధాన్ని ప్రయోగించారు. అక్రమంగా కేసులు నమోదు చేశారు. కేసులకు భయపడ కుండా, అరెస్టు చేసినా, జైలుకెళ్లినా బెదరకుండా ఉద్యమమే ఊపిరిగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల్లో గుర్తింపు సంపాదించుకుంది. అందుకే ఇటీవల హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘనవిజయం సాధించింది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకుని విద్యార్థుల మన్ననలను పొందింది.
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం. వాటి పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి. గురుకులాలను అద్దె భవనాల్లో కాకుండా శాశ్వత భవనాలను నిర్మించాలి. మౌలిక వసతులను మెరుగుపర్చాలి. విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యనందించాలి. జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యారంగానికి సరిపోయినన్ని నిధులు కేటాయించాలి. విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే విద్యార్థులకు సామాజిక బాధ్యత పెరుగుతుంది. విద్యార్థులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్మిస్తాం. విద్యార్థులను భాగస్వాములను చేస్తాం.