21వ శతాబ్దంలో విద్యార్థులను కేవలం మార్కుల యంత్రంగా పరిగణిస్తున్న తరుణంలో పిల్లలకు విద్యా విషయాల పట్ల అవగాహన కార్పొరేట్ విద్యా వ్యవస్థ బట్టీ చదువుల ద్వారాను వస్తుందనుకోవటం మన భ్రమ. ఇలాంటి భ్రమల నుండి బయట పడేసి, బాలల కోసం సులువైన పద్ధతులు ఆలోచింపచేసే విధంగా మంచి కవిత్వాన్ని అందించారు దర్భశయనం శ్రీనివాసచార్య. ‘బాటసారి పదాలు’ కవిత్వం బాలల మనుసులను స్పశిస్తూ, వారి జీవితాలకు ఒక అద్భుతమైన మార్గదర్శక నిలుస్తుంది. ఈ కవిత్వం చిన్నారులను ఉత్సాహంగా శ్రమను నమ్ముతూ పట్టుదలతో అధ్యయనం చేయడానికి ప్రోత్సహిస్తుంది.
”సహజంగానే పలుకు/ సరళంగానే బతుకు/ సొగసులు దక్కును నీకు/ ఓ బాటసారీ!” అంటూ సరళమైన భాషతో, చిన్నారులకు అర్థమయ్యే విధంగా పదాలను వివరించారు. ”ఊపిరి నిచ్చేది అమ్మ/ ఊయల అయ్యేది అమ్మ/ తరగని ఆశీస్సు అమ్మ /ఓ బాటసారీ! ఆపిల్ అనడానికి ముందు/ అరటి అనడం కడు పసందు/ అమ్మ ఉన్నది తెలుగు నందు/ ఓ బాటసారీ! ఆడకా పడకా/ ఎగరకా తిరగకా/ అదేమి బాల్యం ఇక/ ఓ బాటసారీ!/ ఆటలు లేని చదువులు/ పాటలు నేర్పని బడులు/ పిల్లలకవి ఎడారులు/ ఓ బాటసారీ!” పదాల అర్థాలను తెలుసుకోవడం ద్వారా చిన్నారులలో భాషాభివద్ధి జరుగుతుందని రచయిత గ్రహించి కవిత్వాన్ని అందించారు. ప్రతి కవిత ఒక విలువను బోధిస్తుంది. పిల్లల్లో మంచి విలువలను పెంపొందిస్తుంది.
రచయిత భాష పట్ల ఉన్న ప్రేమను పదాల ద్వారా చక్కగా వ్యక్తపరిచారు. పదాలను విశ్లేషిస్తూ, వాటిలోని లోతైన అర్థాలను బయటపెట్టారు. సరళమైన భాషతో, చిన్నారులకు అర్థమయ్యే విధంగా పదాలను వివరించారు. పదాల అర్థాలను తెలుసుకోవడం ద్వారా చిన్నారుల భాషాభివద్ధి జరుగుతుంది.
పదాలను విశ్లేషించడం ద్వారా చిన్నారుల ఆలోచనా శక్తి పెరుగుతుంది. చిన్నారులు తమ జీవితంలో విలువలను నేర్చుకోవాలని కోరుకునే ప్రతి చిన్నారి ఈ పుస్తకం చదవవచ్చు. మంచి విలువలను పెంపొందించాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ పుస్తకం ద్వారా తమ పిల్లలకు మార్గదర్శనం చేయవచ్చు. ఉపాధ్యాయులు తరగతిలో భాషాభివద్ధి, విలువల బోధన కోసం ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
‘బాటసారి పదాలు’ పుస్తకం చిన్నారులకు అద్భుతమైన కానుక. ఈ పుస్తకం చదివిన ప్రతి చిన్నారి తన జీవితంలో మంచి మార్పును తీసుకురాగలుగుతారు. బతుకు భరోసానిచ్చే బాటసారి పదాలు అంటూ చక్కనైన ముందుమాటను అందించారు చంద్రశేఖర శాస్త్రి. ఈ చిన్ని కవితల పుస్తకం భావితరపు బాలల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.
– పూసపాటి వేదాద్రి, 9912197694