– కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థుల్లేరు..
– యుద్ధానికి ముందే బీజేపీ చేతులెత్తేసింది…
– దాని దుకాణం బంద్ అయింది..కథ ఒడిసిపోయింది…
– మీడియాతో ఇష్టాగోష్టిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– వామపక్షాలంటే గౌరవం లేకకాదు..
– లెక్క కుదరలేదంతే… వారికి దూరం కావటం దురదృష్టకరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ పార్టీ తొలి జాబితా ప్రకటించి అరవై రోజులైందనీ, కానీ ప్రతిపక్ష పార్టీలకు ఇప్పటికీ అభ్యర్థుల విషయంలో స్పష్టత లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఆయన చెప్పారు. ఆ పార్టీ చరిత్ర, దాని ట్రాక్ రికార్డే కాంగ్రెస్‌కు గుదిబండగా మారనుందని జోస్యం చెప్పారు.. బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందనీ, దాని దుకాణం బంద్ అయిందనీ, రాష్ట్రంలో ఆ పార్టీ కథ ఒడిసిపోయిందని ఎద్దేవా చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందనీ, ఈసారి 110 స్థానాల్లో ధరావతు కోల్పోనుందని చెప్పారు. అభ్యర్థుల జాబితా విడుదలతోపాటు ప్రచారంలోనూ అన్ని పార్టీల కంటే బీఆర్‌ఎస్ ముందుందనీ, అదే తరహాలో ఎన్నికల ఫలితాల్లోనూ తాము ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావా నికి ముందు వ్యవసా యం, పరిశ్రమలు, కరెంటు, ఉద్యోగ నియామకాలు, సంక్షేమ ం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తదితరాం శాలు ఎలా ఉన్నాయి..? రాష్ట్రం వచ్చిన తర్వాత వాటి పరిస్థితేంటి..? అనే విషయాలను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పైన, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 24 వేల ఉద్యోగాలను ఇస్తే, తమ హయాంలో 2014 నుంచి ఇప్పటి దాకా లక్షా 34 వేల కొలువులను ఇచ్చామంటూ గుర్తు చేశారు. ఇంకా 90 వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఈ రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదికి కేవలం వెయ్యి ఉద్యోగాలను మాత్రమే ఇస్తే.. బీఆర్‌ఎస్ సర్కారు సంవత్సరానికి 13 వేల ఉద్యోగాలను ఇచ్చిందని చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, తాగు, సాగునీరు, పెట్టుబడులు, సంక్షేమం… ఇలా ఏ రంగంలోనూ కాంగ్రెస్ తమతో పోటీ పడలేదని విమర్శించారు. ఈ వాస్తవాలన్నింటినీ మరిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… బీఆర్‌ఎస్‌ది కుటుంబ పార్టీ, కేసీఆర్ హయాంలో ఇసుక మాఫియా, అవినీతి పెరిగిందంటూ వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. ఈసారి రాష్ట్రానికి వచ్చేటప్పుడు కొంచెం తెలుసుకుని రండంటూ రాహుల్‌కు చురకలంటించారు. కర్నాటక ఎన్నికల్లో అనేక హామీలను గుప్పించిన కాంగ్రెస్… ఇప్పుడు అక్కడ ఐదు గంటలపాటు కరెంట్ కోతలు విధిస్తోందని విమర్శించారు. తెలంగాణలో మాదిరిగా చత్తీస్‌ఘడ్‌లో పండిన ప్రతీ గింజనూ అక్కడి ప్రభుత్వం కొంటున్నదా..? అని ప్రశ్నించారు. వీటిపై సమాధానం చెప్పకుండా సుద్దులు చెబితే ఎలా అంటూ నిలదీశారు.
ఎన్నికల సమయం కాబట్టి వివిధ పార్టీల్లో చేరికలు కొనసాగుతుండటం సహజమేనని కేటీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే బీఆర్‌ఎస్ నుంచి నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన ఓటర్లు మాత్రం మారబోరని చెప్పారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీకి నేతలు అనేక మంది ఉన్నా… ఒక్క సీటును గెలిచాం, కానీ ఇప్పుడు అనేక మంది పార్టీని వీడారు, అందువల్ల అక్కడ సీట్లు పెరుగుతాయని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. వ్యక్తులు మారినంత మాత్రాన వ్యవస్థ మారబోదని యన కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాలో కొంత మంది నేతలు పార్టీని శాసించే స్థితికి వెళ్లిపోయారు, అందువల్ల కఠినంగా ఆలోచించి ధృడ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లెఫ్ట్ పార్టీలను ఎందుకు దూరం చేసుకున్నారంటూ విలేకరులు అడగ్గా… ‘వామపక్షాలంటే మాకు గౌరవం లేక కాదు.. లెక్క కుదరలేదంతే…ప్రతిపక్షాలకు అవకాశమివ్వకూడదని భావించాం. ఏదేమైనా ఆయా పార్టీలకు బీఆర్‌ఎస్ దూరమవటం దురదృష్టకరం…’ అని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది బీఆర్‌ఎస్, వామపక్షాలేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమపై ఉన్న అచంచల విశ్వాసమే తమ పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని కేటీఆర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సారొస్తే..జాబ్ క్యాలెండర్
రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటం గురించి ప్రస్తావించగా…’పథకాలొక్కటే కాదు, కరెంటు ఇవ్వొద్దంటూ డిస్కామ్‌ల మీద ఒత్తిడి తెస్తున్నారు.. నిధులు విడుదల చేయొద్దంటూ ఆర్థిక సంస్థల మీద ఆంక్షలు విధిస్తున్నారు.. గత తొమ్మిదిన్నరేండ్లుగా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు…’ అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ‘ఉద్యమకారులందర్నీ బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు కదా..? మరి కోదండరామ్‌ను చేర్చుకుంటారా..?’ అని అడగ్గా… ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారు కదా..? అని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ అనేది కుంభకోణాల కుంభమేళా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీఆర్‌ఎస్ అనేది బీజేపీకి బీ-టీమ్ అంటున్నారనీ, వాస్తవానికి మహారాష్ట్రలో మతతత్వ పార్టీ అయిన శివసేనతో కలిసి నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ కాదా..? అని ప్రశ్నించారు. మేఘాలయలో మొన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీ కలిసే పని చేశాయని గుర్తు చేశారు. మక్తల్, మణికొండ మున్సిపాల్టీల్లో ఇప్పుడు కూడా ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర నేతలు ఢిల్లీకి బానిసలంటూ ఆయన ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంఐఎం అనేది మతతత్వ పార్టీ కాదనీ, అది తమకు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకొచ్చారు.