– రూ.900 కోట్ల ఎన్నికల బాండ్ల కొనుగోలు
న్యూఢిల్లీ : దేశంలోని కనీసం 30 ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలు రూ.900 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందజేశాయి. వివిధ రాజకీయ పార్టీలకు అందిన రూ.12,155 కోట్ల విరాళాలలో ఈ కంపెనీల వాటా 7.5%. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన ప్రముఖ ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థలలో యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (హైదరాబాద్-రూ.162 కోట్లు), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ (రూ.80 కోట్లు), అహ్మదాబాద్‌లో కేంద్ర కార్యాలయం ఉన్న టారెంట్ ఫార్మాస్యూటికల్స్ (రూ.77.5 కోట్లు), హైదరాబాదుకు చెందిన నాట్కో ఫార్మా (రూ.69.25 కోట్లు), హైదరాబాదుకే చెందిన హెటెరో ఫార్మా, దాని అనుబంధ సంస్థలు ఉన్నాయి. బియోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు కిరణ్ మజుందార్ షా కూడా ఆరు కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశారు. ఫార్మా పరిశ్రమకు చెందిన సిప్లా కంపెనీ సైతం రూ.39.2 కోట్ల విలువైన ఈబీలను కొనుగోలు చేసింది.
యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆరు దశలలో 80 బాండ్లను కొనుగోలు చేసింది. ఒక్క 2022 ఆగస్టులోనే రూ.80 కోట్ల విలువైన బాండ్లు కొన్నది. హెటెరో ఫార్మా మూడు విడతలుగా బాండ్లు కొనుగోలు చేసింది. దానికి ముందే ఆ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. లెక్క చూపని రూ.550 కోట్ల నగదును అధికారులు కనుగొన్నారు. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన ఫార్మా కంపెనీల జాబితాలో హైదరాబాదుకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థలు భారత్ బయోటెక్ (రూ.10 కోట్లు), బయలాజికల్ ఈ (రూ.5 కోట్లు) కూడా ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీ కోసం ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విశేషమేమంటే పలు ఫార్మా కంపెనీలు ఒకే రోజు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశాయి. ఉదాహరణకు 2022 నవంబర్ 10న సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇప్కా లేబొరేటరీ కలిపి మొత్తంగా రూ.50 కోట్ల విలువైన బాండ్లను కొన్నాయి. ఆ మరునాడే గ్లెన్‌మార్క్, మాన్‌కైండ్ కంపెనీలు రూ.30 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. మూడు రోజుల తర్వాత అంటే నవంబర్ 14న అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, ఆల్‌కెమ్ లేబొరేటరీస్, పిరమల్ కంపెనీలు రూ.20 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేయడం జరిగింది. 2022 మార్చిలో పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి గ్లెన్‌మార్క్ ఫార్మా, సిప్లా, మైలాన్, అరబిందో ఫార్మాపై డీజీజీఐ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి విరాళాలు సమర్పించుకున్నాయి.