వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబి నేషన్‌లో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ‘పటాస్’ సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కుదరలేదు. ఫైనల్‌గా13 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్‌లో ‘బలగం’ సినిమా చేశాను. సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రొడక్షన్‌లో వెంకటేష్, అనిల్ కాంబోతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఇదంతా పాటకు దక్కిన గౌరవం. ‘ధమాకా, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్’ .. ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం ఈ సినిమా. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే, అనిల్‌కి సాహిత్యం, సంగీతంపై ఉన్న అభిరుచి దీనికి కారణం. వెంకటేష్ సినిమాకి నేను పని చేయడం, ‘పొంగల్..’ సాంగ్‌ను స్వయంగా వెంకటేష్ పాడటం దేవుడి దయగా భావిస్తున్నాను. సంగీత దర్శకుడిగా ఇది నాకో ఎచీవ్‌మెంట్. నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’.
‘గోదారి గట్టు..’ సాంగ్ రమణ గోగుల పాడటం, ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంటూ 70 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే నేను పాడిన ‘మీను’ సాంగ్ 17 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా రీరికార్డింగ్ చేశాను. ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ప్రేక్షకులు చూడబోతున్నారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘మ్యాడ్ 2, మాస్ జాతర, టైసన్ నాయుడు, డకాయిట్’ సినిమాలు చేస్తున్నాను.