మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

We are committed to the development of minorities– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో/ ధూల్‌పేట్‌/ మెహదీపట్నం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సామాజిక అసమానతల గోడలు కూల్చడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ గోల్కొండ ఇబ్రహీంబాగ్‌లో రూ.20 కోట్లతో నిర్మించిన మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజీ శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ముస్లిమ్‌ల పిల్లలకు సరైన విద్య అందించడం ద్వారా ఘణనీయమైన మార్పుకు నాంది పలుకవచ్చన్నది తన విశ్వాసమన్నారు. ఇబ్రహీంబాగ్‌లో తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనాన్ని ప్రారంభించడంతో ఒక ముందడుగు వేశామన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని విధాలుగా వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఉన్నత నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మైనార్టీల కోసం నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలలు మరిన్ని చూడాలనుకుంటున్నట్టు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలను సీఎం ప్రారంభించడం సంతోషకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌తో కలిసి 2020లో ఈ పాఠశాల, కళాశాల భవనాల నిర్మాణానికి తాను శంకుస్థాపన చేసినట్టు గుర్తు చేశారు. రూ.20 కోట్లతో జీ ప్లస్‌ -4 అంతస్తులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఖాళీ స్థలం, 28 తరగతి గదులు, కనీసం 500 మంది విద్యార్థులు ఉండేందుకు వీలుగా దీన్ని నిర్మించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌ కుమార్‌యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు కౌసర్‌ మొహియుద్దీన్‌, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురశెట్టి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, టెమరీస్‌ సెక్రటరీ ఆయేషా సుస్రత్‌జహ తదితరులు పాల్గొన్నారు.