– ఎంపీ ఎన్నికల అనంతరం కార్యాచరణ వేగవంతం చేస్తాం : డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వెబ్‌సైట్ ఆవిష్కరణలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చే విషయంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కార్యాచరణను వేగవంతం చేస్తామని భరోసా నిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన ఇంటిలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం మంత్రి డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఇతర ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన పదేండ్ల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల కలిసి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని కోరిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల చిరకాల కోరికైన సొంతింటి కలను సాకారం చేసే విశాల హృదయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇప్పటివరకు జర్నలి స్టులకు ఇండ్లస్థలాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ మేననీ, అతి త్వరలోనే అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో డీజేహెచ్‌ఎస్ ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు గంగాపురం ప్రతాప్‌రెడ్డి, కొత్తకాపు విక్రమ్‌రెడ్డి, స్వామిరెడ్డి, సభ్యులు శ్రావణి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.