కేసీఆర్‌ లేఖపై నిపుణులతో చర్చిస్తున్నాం

– అభ్యంతరాలపై పున:పరిశీలన జరుపుతాం పవర్‌ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యుత్‌ కొనుగోళ్లపై వివరణ ఇస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖపై నిపుణులతో చర్చిస్తున్నామని పవర్‌ కమిషన్‌ చైర్మెన్‌ జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి తెలిపారు. లేఖలోని అంశాలపై ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారనీ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని తెలిపారు. ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ అభ్యంతరాలపై పున్ణపరిశీలన జరుపుతామని వివరించారు. విచారణలో జరిగిన పరిణామాలను మాత్రమే తాను మీడియాకు వివరించాననీ, ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజమని ఆయన చెప్పారు.