– కొలావార్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్సపోచయ్య
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ఎటువంటి అనుమతులు లేకుండా ఈనెల 14న నియమించిన రాష్ట్ర కమిటీని బర్తరఫ్ చేస్తున్నట్లు కొలావార్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని చత్రపతి భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. జీఓ నెంబర్ 3 పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అప్పుడే ఆదివాసులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన డీఎస్సీ రద్దుచేసి అదనపు పోస్టులతో కొత్త డీఎస్సీ వేయాలన్నారు. ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ వేయాలన్నారు. కొలావార్ సంఘంలో కొంతమంది వ్యక్తులు సంఘాన్ని నిర్వీర్యం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారని అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఆదివాసులకు న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సలహాదారు నాంపల్లి శంకర్, ఉపాధ్యక్షులు పోచం, గోపాల్, రాజన్న, జిల్లాలోని నాయకుల పాల్గొన్నారు.