– శాంతి కోసం కృషిచేయాలి : పీ-20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ‘నేడు ప్రపంచం సంఘర్షణను ఎదుర్కొంటోంది. ఇది ఎవరికీ మంచిదికాదు… ఇది శాంతి సోదరభావ సమయం’ అని ప్రధాని మోడీ అన్నారు. తీవ్రవాదం ఎక్కడ చోటు చేసుకున్నా, ఏ కారణంతో జరిగినా అది మానవాళికి, మానవత్వానికి విరుద్ధమైనదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇక్కడ యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జి 20 పార్లమెంటరీ స్పీకర్స్ 9వ సదస్సును మోడీ ప్రారంభించారు. జీ-20 దేశాల పార్లమెంటు స్పీకర్లు ఇందులో పాల్గొన్నారు. ‘మీరందరూ ఇక్కడికి రావడం శుభపరిణాం. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలి’ అని మోడీ సూచించారు. ఇది శాంతి కాలం. అందరం కలిసి కదలాలన్నారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉగ్రవాదం ప్రపంచానికి సవాల్.. ఇది ప్రపంచంలో ఏ మూలైనా జరగొచ్చు. ఉగ్రవాదం నిర్వచనం విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడం బాధాకర మని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఉగ్రవాదులు వేలాదిమందిని చంపారని గుర్తుచేశారు. ఉగ్రవాదం ఎక్కడ జరిగినా, ఏ కారణం చేతనైనా, ఏ రూపంలో వచ్చినా అది మానవత్వానికి విరుద్ధమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ రోజు కూడా ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై అంతర్జాతీయ సమావేశం ఏకాభిప్రాయం కోసం వేచి ఉందని చెప్పారు.