నవతెలంగాణ ఆర్మూర్
గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పివిఆర్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హైదరాబాద్ తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజా సమస్యలను తీరుస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 10 లక్షల ఆరోగ్యశ్రీ ప్రజలకు ఇచ్చినట్టు, రైతులకు 18 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు, బిసి డిక్లరేషన్ ద్వారా కులగనన చేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. జిల్లా పార్లమెంట్ సభ్యులు అరవింద్ పసుపు బోర్డు అని ఆరేండ్లు గడిపినాడని స్థానిక ఎమ్మెల్యే సైతం ఎన్నికలకు ముందు గ్రామంలో 10 ఇండ్లు నిర్మిస్తా అని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆకుల రాము, పెర్కిట్ శేఖర్ రెడ్డి, చిట్టి రెడ్డి, నియోజక వర్గంలోని వివిధ మండలాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.