
పిఎంపి (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్), ఆర్ఎంపి (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్) ల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొనుగోటి హనుమంతరావు అన్నారు. పిఎంపి, ఆర్ఎంపి ల సమస్యలను పరిష్కరించాలని, శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లను అందజేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీలకు బుధవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎంపి, ఆర్ఎంపీల సమస్యలు పరిష్కరించాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని తెలిపారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని సూచించడం హర్షినియమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు, కార్యదర్శి నరసింహ రెడ్డి, బ్రహ్మచారి, డిఎస్ఎన్.చారి, ఎండి. నసిరుద్దీన్, వెంకటేశ్వర్లు గౌడ్, మదన చారి, యాదగిరి, అంజయ్య, లలిత, మణి కుమారి, తదితరులు పాల్గొన్నారు.