ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటాం

– చిత్రపరిశ్రమకు ఆయన సేవలు అద్భుతం :విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
– చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి విగ్రహావిష్కరణ
నవతెలంగాణ-గండిపేట్‌
చిత్ర పరిశ్రమ కోసం ఎంతో కృషి చేసిన ప్రముఖ దర్శకుడు, సినీ నటుడు ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ మణికొండ మున్సిపాలిటీలోని చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభలేని అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రభాకర్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభాకర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. చిత్రపురి కాలనీ కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా కాలనీ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. సినీపరిశ్రమకు ప్రభాకర్‌రెడ్డి చేసిన త్యాగాలు మరవలేనివన్నారు. ఆయన కృషితో సినీ కార్మికులకు ఇండ్లు వచ్చినట్టు గుర్తు చేశారు. అందరికీ ఇండ్లు వచ్చాకనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి, ఎన్‌.శంకర్‌, నటులు బిత్తిరి సత్తి, ఇతర సినీ ప్రముఖులు, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్‌, బీఆర్‌ఎస్‌ మణికొండ ఫ్లోర్‌ లీడర్‌ రామకృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షులు రూపారెడ్డి, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షులు ఎండీ బషీర్‌, కౌన్సిలర్లు, సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు, తదితరులు పాల్గొన్నారు.