ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం

We are opposing the Supreme Court verdict on SC classification– జాతీయ మాల మహానాడు పోలీట్ బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు.
నవతెలంగాణ – రాయపోల్
ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఉద్యోగ నోటిఫికేషన్ లలో వర్గీకరణ అమలకు ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జాతీయ మాల మహానాడు పోలీట్ బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ ఎలుక దేవయ్యలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మందకృష్ణ మాదిగకు ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించే విధంగా బిజెపి ఆలోచనను తప్పుపడుతున్నామన్నారు.
వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు, ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల ఐక్యమత్యానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పును భావించాల్సి వస్తుందన్నారు. దేశంలో ఐక్యంగా ఉన్న ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడదీయడం కోసమే ఈ తీర్పు వర్తిస్తుందన్నారు. దళిత బహుజనలు కులాలు ఉప కులాలుగా విడిపోతే రాజ్యాధికారం అసలు లక్ష్యాన్ని సాధించలేమన్నారు. దేశంలో 85 శాతం జనాభా ఉన్న దళిత బహుజనలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధిస్తామన్నారు. ఎస్సీ జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని ప్రతి రాష్ట్రంలో జనాభాలో వ్యత్యాసం ఉంటుందని రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారన్నారు. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజాసంఘాలు పోరాటం చేస్తున్నాయని, మాలలలో ఐక్యమత్యం లేకనే ఈరోజు వర్గీకరణ అనుకూల తీర్పు వచ్చిందన్నారు.ఇకనైనా మాల, మాల ఉపకులాల ప్రజలు మేల్కొని వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ పదవులు పొంది జాతితో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న మాల జాతి చెందిన ప్రజలు మేలుకోవాలన్నారు. ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రిజర్వేషన్ ఫలాలతో అభివృద్ధి చెంది జాతిని మర్చిపోవడం బాధాకరమన్నారు. అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ సొసైటీ మాల ప్రభుత్వ ఉద్యోగులు సహకారం అందించాలన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించే హలో మాల చలో ఢిల్లీ చైతన్య దీక్షలను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకులు దామోదర నర్సయ్య, జక్కుల రాజు,వెన్న రాజు, ఎలుక పోచయ్య తదితరులు పాల్గొన్నారు.