అసైన్డ్ భూ బాధితుల హెచ్చరిక
అండగా ఉంటాం : అఖిల పక్ష సమావేశంలో కోదండరాం, సర్వే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మా తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్నాం. అవే మాకు జీవనాధారం. లేఅవుట్‌ల పేరుతో ప్రభుత్వం అసైన్డ్ భూములను గుంజుకుంటున్నది. మా భూముల జోలికొస్తే దేనికైనా సిద్ధమే’ అని భూ బాధితులు హెచ్చరి స్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని అఖిలపక్షపార్టీల నేతలు భరోసా ఇచ్చారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్ భూములను అక్రమంగా గుంజుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి’ అంశంపై తెలంగాణ భూ రక్షణ సమితి(టీబీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో బుధవారం సోమాజీగుడ ప్రెస్‌క్లబ్‌లో బుగ్గ మైసయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ భూమి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, వెట్టి నుంచి విముక్తి చేసిందని అన్నారు. భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తున్నదని విమర్శించారు. రైతుల భూములను కబ్జాదారులు అక్రమిస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేవారని, కానీ నేడు ప్రభుత్వమే కబ్జా చేస్తున్నదని ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర భూమి తగ్గిపోతున్నదని, ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయని తెలిపారు. పరిశ్రమల పేరుతో అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటున్నదని చెప్పారు.
లేఅవుట్లు, రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ పేరుతో అసైన్డ్ భూములను తీసుకుంటున్న ప్రభుత్వానికి పరిహారం ఇవ్వడానికి చేతులురావడం లేదని విమర్శించారు. జూన్ 2 నుంచి కేసీఆర్ భజన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, అందులో ఒక రోజు సంక్షేమ దినంగా పాటించాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ దినం రోజునే భూ బాధితులంతా నిరసన దినంగా పాటించాలని, తమ మద్దతు కూడా ఉంటుందని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. పేదల భూములను లాక్కొని పెద్దలకు మేలు చేయడానికే ధరణి తీసుకొచ్చారని విమర్శించారు. పేదలకు సంబంధించిన అసైన్డ్ భూముల్లో లేఅవుట్లు చేస్తున్న ప్రభుత్వం పెద్దల భూముల్లో చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను లాక్కోవడానికి అప్పటి సీఎం వైఎస్‌ఆర్ ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని చెప్పారు. కోనేరు రంగారావు సిఫార్సులను అమలుచేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
తన వల్లే తెలంగాణ వచ్చిందని, పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడింది తానేనని చెప్పారు. తెలంగాణ రావడానికి తాను, మీరాకుమార్, సుశీల్‌కుమార్ షిండేనే కారణమని, వీరంతా మాదిగ బిడ్డలని గుర్తుచేశారు.
తెలంగాణ భూ రక్షణ సమితి అధ్యక్షులు బుగ్గ మైసయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 6లక్షల ఎకరాల భూదాన్ భూముల్లో వినోబావే లక్ష ఎకరాలు పేదలకు పంచారని, మరో 5లక్షల భూములు కేసీఆర్ చేతిలో ఉన్నాయని తెలిపారు. చట్టం ప్రకారం 12ఏండ్లపాటు సాగుచేస్తే అసైన్డ్ భూములు పట్టా భూములుగా మారుతాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా గుంజు కుంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భూ రక్షణ సమితి చైర్మెన్ రాపోలు రాములు, సలహాదారులు చింతా స్వామి, భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు.