– పేదలు గొప్పగా ఉండాలనదే సీఎం కేసీఆర్ విజన్
– రెండో విడతలో వికలాంగులు,ఎస్సీ, ఎస్టీలకు
– రిజర్వేషన్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
– 24 నియోజకవర్గాల్లో 11,700 లబ్దిదారుల ఎంపిక.. 21న పంపిణీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో శుక్రవారం రెండో విడతలో భాగంగా ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆన్‌లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో రెండో విడతగా 11,700 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్టుగా తెలిపారు. రెండో విడత ప్రక్రియలో వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. వికలాంగులకు 470, ఎస్సీలకు 1,923, ఎస్టీలకు 655 ఇండ్లు కేటాయించగా.. ఇతరులకు 8,652 కేటాయించినట్టు వివరించారు. కేటాయింపుల్లో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసినట్టు చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలు గొప్పగా బతకాలనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్న ఏరియాల్లో ఇండ్లు కట్టించి పంపిణీ చేస్తున్నామన్నారు. ఇండ్లు రాని వారు ఆందోళన చెందొద్దని, చివరి విడత వరకు ఆగాలని దరఖాస్తుదారులను మంత్రి కోరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని వారికి 3 లేదా 4వ విడతలో ఇండ్లు ఇవ్వాలనే యోచనలో ఉన్నామన్నారు. మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియకన్నా ఇది ఎన్నో రెట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తుందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్‌ఐసీ సిబ్బంది ప్రధాన భూమిక పోషించారని, వారికి అభినందనలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. రెండో విడత ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌ఐసీ సహకారంతో రాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్దిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠా గోపాల్, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, వాణీదేవి, మీర్జా రహమత్ బేగ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోరు కుమార్, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, హైదరాబాద్ ఆర్డీవోలు సూర్యప్రకాశ్, రవికుమార్, ఎన్‌ఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.