అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణకు సేవకులం

–  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అధికారంలో ఉన్నా లేకున్నా తాము తెలంగాణ సేవకులమన్నది మరిచిపోవద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ”ఎక్స్‌”లో పోస్ట్‌ చేశారు. కష్టపడి పనిచేసినందుకు బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం పనిచేసిన సోషల్‌ మీడియా వారియర్స్‌ కు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు తెలిపారు.
ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు.. మంత్రి హరీశ్‌రావు
ప్రజాతీర్పును గౌరవిస్తున్నామంటూ, గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రెండు సార్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని కోరారు.ఎన్నికల సమరంలో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా శ్రమించిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.