అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్‌ చేస్తున్నాం

– ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌రావుకు లేదు:మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సెట్‌ చేస్తున్నామనీ, తాము చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామంటూ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి హరీశ్‌రావుకు కౌంటరిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటేనే.. హరీష్‌ రావు పరిస్థితేంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆలోచనలనే ఇక్కడ అమలు చేస్తామనీ, ఏపీ ఆలోచనలు ఇక్కడెందుకు అమలు చేస్తామని ప్రశ్నించారు. 12 ఏండ్ల తర్వాత గ్రూప్‌ -1 పరీక్షను తమ ప్రభుత్వమే నిర్వహించిందని గుర్తు చేశారు.
త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తామని చెప్పారు. మూడు నెల్లు పరిపాలన చేయగానే ఎలక్షన్‌ కోడ్‌ వచ్చిందనీ, ఇప్పుడే కోడ్‌ ముగిసిందనీ, హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్‌ రావుకు లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గుర్రాలతో ఆశా వర్కర్స్‌ను తొక్కించారని తెలిపారు. పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతుందనీ, ఆ ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు. మత ఘర్షణల విషయంలో సీరియస్‌గా ఉన్నామనీ, వాటి వెనక ఎవరి హస్తం ఉన్నా ఉక్కు పాదంతో అణిచేస్తామని ట్విట్టర్‌ వేదికగా శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.