– రాష్ట్ర మహిళా భద్రతా విభాగం
– డీజీపీ షికా గోయెల్ వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలోని ప్రతి పోలీసు సబ్‌డివిజన్‌లో షీటీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఐడీ డీజీపీ, మహిళా భద్రతా విభాగం ఇంచార్జీ కూడా అయిన షికా గోయెల్ వెల్లడించారు. రాష్ట్రంలో షీటీమ్‌ల ఏర్పాటు జరిగి గురువారం నాటికి పదేండ్లు గడిచిన సందర్భంగా ఆమె ఈ విభాగం అధికారులు, సిబ్బందిని అభినందించారు. 2014, అక్టోబర్ 24న రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీటీమ్‌లను ఏర్పాటు చేశామనీ, అది దినదినం తన విధులను పెంచుకుంటూ రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల మరింత విశ్వాసాన్ని పెంపొందించే రీతిలో కార్యకలాపాలను సాగించి, ప్రతిష్టను గడించిందని షికా గోయెల్ అన్నారు. ఈ పదేండ్లలో రోడ్లు మొదలుకొని కాలేజీలు, కాలనీలు, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రయివేటు ఫ్యాక్టరీలల్లో మహిళలను వేధించేవారి పట్ల కఠిన చర్యలు తీసుకున్నామనీ, ఈ విధంగా ఈ పదేండ్లలో 13వేలకు పైగా పోకిరీలు, ఈవ్‌టీజర్లపై చర్యలను తీసుకోవటం జరిగిందని ఆమె చెప్పారు. అలాగే, మహిళలను ఆన్‌లైన్లలో వేధించేవారికి సంబంధించి దాదాపు 16వేలకు పైగా కేసులను నమోదు చేయటమేగాక, ఎఫ్‌ఐఆర్‌ను కూడా రిజిస్టర్ చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 పోలీసు స్టేషన్ల పరిధిలలో 328 మంది షీటీమ్ అధికారులు పని చేస్తున్నారని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ప్రతి పోలీసు సబ్‌డివిజన్‌తో పాటు పెద్ద పోలీసు స్టేషన్లలో షీటీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అన్నారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని వచ్చే నవంబర్ నెలలో శిక్షణ పూర్తి చేసుకొని వస్తున్న పోలీసు ఎస్సైలు, కానిస్టేబుళ్ల నుంచి నియమించుకోబోతున్నామని ఆమె చెప్పారు. షీటీమ్‌ల ఏర్పాటుతో బాలికలు, యువతులు, విద్యార్థినులు, మహిళల్లో తాము ఎక్కడికి వెళ్లినా షీటీమ్‌ల కారణంగా చక్కటి సెక్యూరిటీ లభిస్తున్నదనే భావనను, భరోసాను పెంపొందించగలిగామని షికా గోయెల్ అన్నారు. ఇకముందు కూడా మంచి ఫలితాలను షీటీమ్‌లు సాధించగలవనే ఆశాభావాన్ని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.