మేం రోజుకు 15 గంటలు పని చేస్తున్నాం

–  కాంగ్రెస్‌ ఎంపీి మనీష్‌ తివారీ
న్యూఢిల్లీ : భారత్‌ శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యపై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కొంతమంది నారాయణమూర్తిని సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా, నారాయణమూర్తి సలహాను సమర్థిస్తున్నవారి జాబితాలోకి కాంగ్రెస్‌ నాయకులు, ఎంపీి మనీష్‌ తివారి చేరారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మా లాంటి ప్రజాప్రతినిధులు రోజుకు 15 గంటల వరకూ పని చేస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. ‘వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు.. అందులో తప్పేముంది? ఓ వైపు ప్రజా జీవితం, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూనే మా లాంటి ప్రజా ప్రతినిధులు రోజుకు 12 నుంచి 15 గంటలు వరకూ పనిచేస్తున్నాం. నేను చివరగా ఎప్పుడు ఆదివారం సెలవు తీసుకున్నానో నాకు గుర్తే లేదు. గెలిచినా, ఓడిపోయిన ప్రజా జీవితంలో ఉన్నవారికి ఆదివారం సెలవు అనేది ఉండదు. వారానికి 70 గంటలు పని, ఒక రోజు సెలవు, సంవత్సరానికి 15 రోజులు విరామం అనేది తప్పనిసరి నియమం కావాలి’ అని మనీష్‌ తివారి ట్వీట్‌ చేశారు.