– వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
నవతెలంగాణ-కుల్కచర్ల
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. గురువారం కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్, కుస్మ సముద్రం గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను చెల్లిస్తూ వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు త్వరితగతిన చేరవేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు త్వరగా పంపడం జరుగుతుంది అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని సేకరించాలని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ,అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ధాన్యం తడవకుండా టార్పాలిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని ఇన్‌చార్జీలకు సూచించారు. జిల్లాలో 38 వేల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పటివరకు రూ. 40 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని ఇప్పటికీ 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరిగిందని, ధాన్యం కొనుగోలు తుది దశకు చేరుకుందనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, మండల తహసీల్దార్ మురళీధర్, ఏపీఎం శోభ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.