– సీఎంతో పార్టీ నేతల భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమకు సీఎం రేవంత్‌రెడ్డిపై పూర్తి నమ్మకముందని మాదిగ సామాజిక తరగతికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, ఊట్ల వరప్రసాద్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మాదిగలకు కాంగ్రెస్‌తోనే పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో వారికి వివిధ పదవుల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాజ్యసభ, శాసనమండలితోపాటు నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ పునరుద్ఘాటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్గీకరణకు అనుకూలంగా బిల్లు తీసుకొస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా 17 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు. మాదిగలను ఐక్యం చేసి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు మొదటి నుంచి కాంగ్రెస్ వైపే ఉన్నారనీ, భవిష్యత్తులో కూడా పార్టీతోనే ఉంటారని భరోసా ఇచ్చారు. బీజేపీ నుంచి దళితులకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. మరో సారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడంతోపాటు రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రమాద ముందని ఆందోళన వ్యక్తం చేశారు. నిలువరిం చడం కోసం తెలంగాణలో మాదిగలను ఏకం చేసి కాంగ్రెస్ విజయం కోసం పని చేస్తామని వారు తెలిపారు.