– అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జగదీష్ చందర్
నవతెలంగాణ- ఆర్మూర్: ఇటీవల పలు బ్యాంకుల ఏటీఎంల లో దోపిడీ దొంగల బీభత్సం పై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోమవారం వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామ 63వ నంబరు జాతీయ రహదారి వద్ద ఉన్న ఆంధ్ర బ్యాంకు ఎటిఎం లో దొంగలు చోరీకి పాల్పడి విపలయత్నమయ్యారు. ఏకంగా ఏటీఎం మెషిన్ ను ధ్వంసం చేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ను దొంగలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులు వెంబడించడంతో దొంగలు పరారయ్యారు .గత మూడు రోజుల క్రితం 44 నంబరు జాతీయ రహదారి పక్కన దూదిగా శివారులోని ఎస్బిఐ బ్యాంక్ పక్కన ఉన్న ఏటీఎంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం ను ధ్వంసం చేసి అందులోని 12.46 లక్షలను ఎత్తుకెళ్లారు. భీంగళ్లో సైతం ఏటీఎంలో చోరీ జరిగినవి. గత సంవత్సరం జూలై రెండవ తేదీ మెండోరా మండలంలోని బుస్సాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉత్తరప్రదేశ్ కు చెందిన దొంగల ముఠా చోరీకి పాల్పడి లాకర్ న ధ్వంసం చేసి 8 నర కిలోల బంగారు ఆభరణాలు,1.75 లక్షల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. దూదిగా శివారులోని ఏటీఎంలో చోరీకి పాల్పడిన దొంగలు హర్యానాకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో దర్యాప్తును వేగవంతం చేసి దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని బ్యాంకులు ఏటీఎంలో వద్ద తగిన రక్షణ లేకపోవడాన్ని గమనించి చోరీలకు పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.ఏటీఎంలలో చోరీకి పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుంటాం .నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాం. బ్యాంకులు, ఏటీఎంలో వద్ద తగిన రక్షణ ఏర్పాట్లను చేసుకోవాలి.