అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాము..

We condemn Amit Shah's comments on Ambedkar.– సుప్రీమ్ కోర్టు న్యాయవాది ఖాజా అహ్మద్
నవతెలంగాణ – రంగారెడ్డి
కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలను పట్టుకొని అంబేద్కర్ అంబేద్కర్ అనే పేరును పదేపదే ప్రస్తావిస్తూ.. మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిందని, దానికి బదులు ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే ఏడు జన్మల వరకు స్వర్గం దొరుకుతుందని అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సుప్రీమ్ కోర్టు న్యాయవాది ఖాజా అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటులో 75 సంవత్సరాల రాజ్యాంగంపైనే చర్చ జరుగుతున్నప్పుడు, మరి ఆ చర్చలో వందలసార్లైన అంబేడ్కర్ పేరు తీయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లు కానీ, దేవుని పేరు కానీ ప్రస్తావించాల్సిన అవసరం రాదన్నారు. 3 వేల సంవత్సరాల భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసి, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, న్యాయ శాస్త్రాలపై ప్రపంచ ప్రఖ్యాతగాంచిన యూనివర్సిటీలలో అధ్యయనం చేసి భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ మార్పుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రూపొందించారని అన్నారు. నేడు ఆ రాజ్యాంగమే భారతదేశాన్ని కాపాడుతున్నందున అంబేద్కర్ దేశానికి ఒక ఐకాన్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు చేయడం దేశ ప్రతిష్టకు మంచిది కాదని, భవిష్యత్తులో ఇలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.