ఏబీవీపీ మూకల దాడిని ఖండిస్తున్నాం

ఏబీవీపీ మూకల దాడిని ఖండిస్తున్నాం– నిందితులను కఠినంగా శిక్షించాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, జిల్లా కార్యదర్శి అశోక్‌ రెడ్డి
– నారాయణగూడ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై ఏబీవీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎల్‌.మూర్తి, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ నారాయణగూడ చౌరస్తాలో ఏబీవీపీ గుండాల దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌.ఎల్‌.మూర్తి, అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాలతో కొట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల మీద దాడి చేయడం సిగ్గుచేటని, సైద్ధాంతికంగా ఎస్‌ఎఫ్‌ఐని ఎదుర్కొలేక ఆర్థిక బలం, రాజకీయ అండతో దాడులు చేస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి వర్సిటీలోని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులపై ఏబీవీపీ నాయకులు దాడిచేసి.. కత్తులతో పొడిచి గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 100 మంది మతోన్మాద మూకలు విద్యార్థులపై దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.రెండ్రోజుల కిందట పీడబ్య్లూడీ విద్యార్థిపై దాడి చేసిన ఏబీవీపీ వారు.. చేయలేదని అబద్ధాలు ప్రచారం చేయడంతో ఎస్‌ఎఫ్‌ఐ సాక్ష్యాలతో నిరూపించిందని చెప్పారు.