పరిపాలనపై దృష్టి సారించి.. పార్టీకి సమయమివ్వలేకపోయాం…

పరిపాలనపై దృష్టి సారించి.. పార్టీకి సమయమివ్వలేకపోయాం...– ప్రజలు మనతోనే ఉన్నారనుకున్నాం
– అసెంబ్లీ ఫలితాలను పక్కనబెట్టి.. లోక్‌సభపై దృష్టి సారించండి : వరంగల్‌ సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్లుగా పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించటం ద్వారా పార్టీకి తగిన సమయం కేటాయించలేకపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు జరుగుతున్న మాదిరిగానే ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించుకోవటం ద్వారా పార్టీని బలోపేతం చేస్తామని ఆయన కార్యకర్తలకు భరోసానిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం’లో నేతలు, కార్యకర్తలనుద్దే శించి కేటీఆర్‌ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడినప్పుడు కూడా ప్రజలు మనతోనే ఉన్నారనే ధీమాతో, అదే అంచనాతో తామున్నామని వివరించారు. ఈ క్రమంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు కూడా ఓడిపోయారని తెలిపారు. అయితే ప్రజలు బీఆర్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో తిరస్కరించలేదని గుర్తు చేశారు. 39 సీట్లతో బలమైన ప్రతిపక్ష హోదానిచ్చారని చెప్పారు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనబెట్టి లోక్‌సభ ఎలక్షన్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వంద రోజుల సమయమివ్వాలని భావించామని కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. అయితే గవర్నర్‌ ప్రసంగంతోపాటు శ్వేతపత్రాల ద్వారా కేసీఆర్‌ను, ఆయన గత ప్రభుత్వాన్ని నిందించేందుకు రేవంత్‌ సర్కార్‌ పూనుకున్నదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పుకునేందుకే ఇలా తమ పార్టీపై అకారణంగా నిందలు మోపుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ వైఖరిని అసెంబ్లీలో గట్టిగా ఎండగట్టామని తెలిపారు. జిల్లాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి చర్యలకు పూనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. నెలరోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనీ, ఈ అంశాన్ని గుర్తించి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.