– అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా బీఆర్‌ఎస్ మాత్రం ప్రజల పక్షమే
– మనకు పోరాటాలు కొత్త కాదు.. భవిష్యత్ మనదే
– ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా ఒక్క ఫోన్‌కాల్ చేయండి.. గంటలో మీ ముందు ఉంటా
– సంగారెడ్డి, జహీరాబాద్ కృతజ్ఞతా సభల్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-సంగారెడ్డి/ జహీరాబాద్
ఒకప్పుడు అధికారం ఉన్నదని పొంగిపోలేదు.. నేడు ప్రతిపక్షంలో ఉన్నామని కుంగిపోవట్లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మనకు పోరాటాలు కొత్తేమీ కాదని, భవిష్యత్ మనదేనని, ఎవరూ అధైర్య పడొద్దని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధైర్యాన్నిచ్చారు. సంగారెడ్డి, జహీరాబాద్‌ల్లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కృతజ్ఞతా సభలకు హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. సంగారెడ్డిలో టిక్కెట్ ఆశించిన పట్నం మాణిక్యం.. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ తనకు టిక్కెట్ దక్కనప్పటికీ.. చింతా ప్రభాకర్ గెలుపే తన గెలుపులాగా కృషి చేశారని కొనియాడారు. కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. సంగారెడ్డి, జహీరాబాద్‌లలో అద్భుతమైన గెలుపును అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధికారంలో లేదని బాధపడొద్దని.. ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని.. గంటలో వారి ముందు ఉంటానని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయామని.. ఎవ్వరూ అధైర్యపడొద్దని చెప్పారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా బీఆర్‌ఎస్ మాత్రం ప్రజల పక్షమే అని అన్నారు. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని.. కేసీఆర్ సారథ్యంలో పదేండ్లలో చేసి చూపించామని చెప్పారు. దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉండగా.. మనకు ఇబ్బందేమీ లేదంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలను సాధించిందని.. అయితే మనకంటే మంచిగా అభివృద్ధి చేస్తారని నమ్మి కాంగ్రెసోళ్లకు ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. అంతేకాకుండా ఇందులో కొంత అసత్య ప్రచారం కూడా పైచేయి సాధించిందన్నారు. ఏది ఏమైనా కొత్త ప్రభుత్నానికి ఓ ఏడాది పాటు సమయం ఇద్దామని.. అప్పటికీ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవలోనే ఉంటానన్నారు. సంగారెడ్డి గడ్డపై గులాబీ జెండా గెలుపు హరీశ్‌రావుకే అంకితం ఇస్తున్నట్టు చెప్పారు.