మేం కదలం

– వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలివ్వాల్సిందే!
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాల పోరుయాత్ర
– పోయిన సర్కారు ఇయ్యలే.. కొత్త సర్కారైనా జాగాలియ్యాలే!
– ఇచ్చిన మాటను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌
– జగిత్యాలకు తరలొచ్చిన వేలాది మంది పేదలు
– కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ
– ఇల్లులేని ప్రతి ఒక్కరికీ 120గజాల స్థలం, రూ.15లక్షలు ఇవ్వాలి
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / జగిత్యాల టౌన్‌
‘ఇండ్ల జాగలు, వాటికి పట్టాలిచ్చే వరకూ గుడిసెలు వేసుకున్న స్థలం నుంచి ఇంచు కూడా కదలం. ఇంకెన్నాళ్లు మమ్మల్ని మోసం చేస్తారు.. పోయిన సర్కారు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇయ్యలే. గుడిసెలు వేసుకున్న జాగలకూ పట్టాలియ్యలే. కొత్తగా వచ్చిన సర్కారైనా పట్టాలిచ్చి, మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లూ కట్టి ఇవ్వాలే..” అని పేదలు నినదించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంటిస్థలాల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన పోరుయాత్రకు సోమవారం వేలాదిగా ప్రజలు తరలొచ్చారు. ఎర్రజెండా చేతబూనిన పేదలు కలెక్టరేట్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ రెండు కిలోమీటర్ల పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓకు దరఖాస్తులతోపాటు వినతిపత్రం అందించారు.
జగిత్యాల జిల్లా కేంద్ర శివారులోని నర్సింగాపూర్‌లో 437/112/2 సర్వే నెంబర్‌లోని దాదాపు 250 ఎకరాల ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేలాది మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఇప్పటికే కోరుట్ల పట్టణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న భూపోరాట స్ఫూర్తిగా జగిత్యాలలోనూ పేదలు తరలివచ్చారు. ప్రతి పేద కుటుంబం నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఆ మొత్తం దరఖాస్తులతో సోమవారం పెద్దఎత్తున ర్యాలీ, బహిరంగసభకు పిలుపునిచ్చారు. నిరుపేదలు వేలాదిగా జగిత్యాల జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ నాయకులు లెల్లెల బాలకృష్ణ, ఆశయ్య ప్రసంగించారు. నిరుపేదలు గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని చాకలి ఐలమ్మ నగర్‌గా నామకరణం చేసుకున్నామని, అక్కడ గుడిసెలు వేసుకున్న ప్రతి పేద కుటుంబానికీ 120 గజాల స్థలం, పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 67 కేంద్రాల్లో లక్షలాది మంది గుడిసెలు వేసుకున్నారని గుర్తు చేశారు. జగిత్యాలలో గుడిసెలు వేసుకున్న భూమికి పట్టాలు ఉన్నాయని అధికారులు అబద్ధాలు ఆడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూముల్లో గుడిసెలు తొలగించొద్దని అన్నారు. రెండు నెలలుగా నిరుపేదలు ఇంటి జాగా కోసం ఎండ, వాన, చలిని తట్టుకుని గుడిసెల్లో తల దాచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోనెంబర్‌ 58 ప్రకారం ప్రతి కుటుంబానికీ 120గజాల స్థలం, దానికి పట్టాలు సాధించే వరకూ కొట్లాడుతామని తెలిపారు. గత సర్కారు ఇండ్లు ఇవ్వకుండా, కనీసం జాగలూ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తాము చేస్తున్న ఇండ్ల స్థలాల పోరాట యాత్రకు వెంటనే మద్దతు ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇల్లులేని ప్రతి పేదవారికీ ఇంటి స్థలం సహా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం అభినందనీయమని, అది వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పేదల ఇండ్ల స్థలాలపై ప్రకటన చేయాలన్నారు. కేంద్రంలోని మోడీ కూడా ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేండ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సర్కారు రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10లక్షలు కలుపుకుని ప్రతి పేద కుటుంబానికీ ఇంటి నిర్మాణం కోసం రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీరి పోరాటానికి జగిత్యాల జిల్లాలోని విద్యావంతులు, ఉద్యమకారులు, వివిధ తరగతుల ప్రజలు, రాజకీయపార్టీల నాయకులు మద్దతుగా నిలవాలని కోరారు. టీఆర్‌నగర్‌ వద్ద వేసుకున్న గుడిసెవాసులకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సారంగపాణి, పార్టీ జిల్లా కన్వీనర్‌ గుగులోతు తిరుపతినాయక్‌, జగిత్యాల ఇండ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు రమేష్‌, ఇందూరి సులోచన, కో కన్వీనర్‌ వెల్గొండ పద్మ, సిరికొండ చంద్రయ్య, ఎమ్‌డి సలీం, బొడ్డు సుధారాణి, ఎం.డి. రఫీక్‌, వెల్మలపల్లి, వెంకటాచారి, ఎస్కె ఆఫీజా, బొర్రా శేఖర్‌, అంగోత్‌ నరేష్‌, రంగు హరీష్‌, బచ్చల వినోద్‌ పాల్గొన్నారు.
కబ్జాకోరుల చేతుల్లోనే సర్కారు భూములు
జగిత్యాల జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను రాజకీయ పలుకుబడి ఉన్నపెద్ద పెద్ద వ్యక్తులు, కార్పొరేట్‌ పెద్దలు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు.. అక్రమంగా ఆక్రమించుకున్నారని, వారంతా సత్రాలు, ట్రస్టులు, ఫాంహౌజ్‌ల పేర్లతో తోటలు, కంపెనీలు, ఫంక్షన్‌ హాల్స్‌, పెట్రోల్‌ బంకులు, రైస్‌ మిల్లులు, టింబర్‌ డిపోలు, ఇటుకల బట్టీలు పెట్టుకున్నారని సీపీఐ(ఎం) నాయకులు విమర్శించారు. అడ్డదారిలో ట్రస్టుల పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజ్‌ చేసుకున్నారని ఆరోపించారు. జగిత్యాల పట్టణంలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ వెనుక భాగంలో కబ్జాకు గురైన విలువైన ప్రభుత్వ భూములు కండ్ల ఎదుటే కనిపిస్తున్నాయని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్పీ క్వార్టర్స్‌ భూములు, వీక్లీ బజార్‌, మోతెచెరువు శికం భూమినీ మింగేశారన్నారు. తిమ్మాపూర్‌, థరూర్‌, నర్సింగాపూర్‌ శివారు ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని చెప్పారు. కొత్త బస్టాండ్‌ పెట్రోల్‌ బంక్‌, మంచాల రామేషం కాంప్లెక్స్‌, రాంబజార్‌ సర్దార్‌ సత్రానికి సంబంధించిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అడ్డదారితో కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.