కరెంట్‌ కష్టాల ప్రభుత్వం మనకొద్దు

– నిరంతరం కరెంట్‌ అందజేసే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వండి
– ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
కరెంట్‌ కష్టాల ప్రభుత్వం మనకొద్దని, కాంగ్రెస్‌ మాయమాటలను ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిదిలోని చౌదమ్మగుట్ట తండా, అన్నారం, రామేశ్వరం, రాయికల్‌ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మూడు గంటలు కరెంట్‌ వస్తుందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ఘనత ఉందని తెలిపారు. ప్రజల అవసరాలు ఎరిగిన కేసీఆర్‌ మళ్ళీ రావాలంటే అందరూ బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ కష్టాలు చూశామని మళ్ళీ అలాంటి ప్రభుత్వం రావాలని ఎవరు కోరుకోరని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరొక్కసారి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని వివరించారు. రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని తెలిపారు. అనవసర హామీలు ఇచ్చే పార్టీలను నమ్మొద్దని, అలాంటి పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని వివరించారు. కేసీఆర్‌ పాలన సజావుగా సాగుతుందని, కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇప్పటికి తేల్చుకోలేక పోతున్నారని అన్నారు. అలాంటి పార్టీలకు ఓటు వేసి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఏదిఏమైనా వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, సంక్షేమ పథకాలు అమలు పరిచేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు.
అభివద్ధి చేసింది అంజన్ననే : అన్నారం సర్పంచ్‌ రాములు గౌడ్‌
షాద్‌ నగర్‌ నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివద్ధి చేసింది అంజన్ననే అని మళ్ళీ ఆయననే గెలిపించాలని సర్పంచ్‌ రాములు గౌడ్‌ అన్నారు. షాద్‌నగర్‌ మరింత అభివృద్ధి కావాలంటే అంజయ్య యాదవ్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. మన గ్రామానికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
అభివద్ధి ప్రధాత అంజయ్య యాదవ్‌ : పీఏసీఎస్‌ చైర్మన్‌ బక్కన్న యాదవ్‌
అభివద్ధి ప్రదాత అంజయ్య యాదవ్‌ అని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు దక్కుతుందని అన్నారు. అభివృద్ధిని గుర్తించి ప్రజలు మరోసారి అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు లక్ష్మణ్‌ నాయక్‌, మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్‌ సభ్యులు రాంబాల్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, సూర్య ప్రకాష్‌, మిట్టు నాయక్‌, సర్పంచులు పల్లె శ్రీనివాస్‌ రెడ్డి, రవీందర్‌ నాయక్‌, బద్ధుల శ్రీశైలం, దీన శంకర్‌, మాజీ సర్పంచులు సుష్మా రెడ్డి, యశోద యాదగిరి, రాయికల్‌ సీనియర్‌ నాయకులు వెంకట్‌ రెడ్డి, ఆశన్న గౌడ్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.