యుద్ధాన్ని కాదు బౌద్ధాన్ని ఇచ్చాం

– వియన్నాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ
వియన్నా: ప్రపంచానికి మన భారతదేశం ‘బౌద్ధాన్ని’ ఇచ్చింది కానీ ‘యుద్ధం’ను కాదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అంటే శాంతి, సంక్షేమాలే భారతదేశం ఎప్పుడూ ఇస్తూ వచ్చిందన్నారు. తద్వారా 21వ శతాబ్దంలో భారత్‌ తన పాత్రను మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. వియన్నాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. అత్యుత్తమమైన, ప్రకాశవంతమైన దేశంగా నిలిచేందుకు భారత్‌ కృషి చేస్తోందని, అతిపెద్దవైన మైలురాళ్లను దాటుతూ సమున్నతమైన లక్ష్యాలను సాధిస్తోందన్నారు. ”వేల సంవత్సరాలుగా, మనం మన విజ్ఞానాన్ని, అనుభవాలను ఇతరులకు పంచుతున్నాం. మనం యుద్ధాన్ని ఇవ్వలేదు, బౌద్ధ తత్వాన్ని ఇచ్చాం.” అని మోడీ పేర్కొన్నారు. మాస్కోలో రెండు రోజుల పర్యటన ముగించుకుని వియన్నా వచ్చిన మోడీ ఇక్కడి భారతీయులను కలుసుకుని వారితో మాట్లాడారు. ఆస్ట్రియాలో తన మొదటి పర్యటన అర్ధవంతంగా జరిగిందన్నారు. భారత్‌, ఆస్ట్రియాల మధ్య 75ఏళ్ళ స్నేహ బంధానికి గుర్తుగా 41ఏండ్ల తర్వాత భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించారని మోడీ వ్యాఖ్యానిం చారు. రెండు దేశాలు భౌగోళికంగా భిన్నమైనవి అయినప్పటికీ ప్రజాస్వామ్యం రెండింటినీ కలుపుతోం దన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, బహుళవాదం, చట్టబద్ధ పాలన పట్ల గౌరవం ఇవన్నీ మనం పంచుకునే విలువలని అన్నారు. మన సమాజాలు బహుళ సంస్కృతులతో సమ్మిళతమైనవని అన్నారు. వైవిధ్యత రెండు దేశాల్లో కనిపిస్తుందన్నారు. అంతకుముందు ఆస్ట్రియాలోని భారతీయులు మోడీకి సాదరంగా స్వాగతం పలికారు.
ఢిల్లీ చేరుకున్న మోడీ
రష్యా, ఆస్ట్రియాల్లో పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటన చారిత్రకమైనదిగా, మంచి ఫలితాలను అందించినదిగా అభివర్ణించారు.