నాడు మాట ఇచ్చాం…నేడు నిలబెట్టుకుంటున్నాం

We gave our word...we are keeping it today– పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తామంటూ ‘నాడు మాట ఇచ్చాం…నేడు నిలబెట్టుకున్నాం’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అనే వాదన హాస్యాస్పదమని ఒక ప్రకటనలో తెలిపారు. జూరాల రిజర్వాయర్‌ సామర్ద్యం 9 టీఎంసీలు .. అందుబాటులో ఉండేది 6 టీఎంసీలేనని పేర్కొన్నారు. ఆ నీటిని ఎత్తిపోయడం సాధ్యమయ్యేపనేనా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం, పాలమూరు ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా నాటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి హడావిడిగా దాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో 263 టీఎంసీల సామర్థ్యం గల శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ప్రాంతం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు తీసుకుంటున్నారని వివరించారు. దశాబ్దాలపాటు జూరాలను నిర్మించిన వారు భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను సాగదీసి పాలమూరును ఎండబెట్టి ప్రజలను వలసలపాలు చేసిన వారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినట్టు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు రంగారెడ్డి అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తికాకుండా కేసులు వేసి అడ్డుకున్న వారే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి పూర్తవుతుండడాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ఈనెల 16న నార్లాపూర్‌ పంప్‌ హౌస్‌ వెట్‌ రన్‌, కొల్లాపూర్‌లోని సీఎం బహిరంగసభకు పాలమూరు ప్రతి పల్లె నుంచి కదిలిరావాలని పిలుపునిచ్చారు.