– మాది ప్రజా ప్రభుత్వం
– పకడ్బందీగా ఆరు గ్యారంటీల అమలు చేసి తీరుతాం
– అభయ హస్తం లోగో, పోస్టర్, ధరఖాస్తు ఫారం ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి
– నేటి నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
– అన్ని గ్రామాలు, పట్టణాల్లో సభలు
– రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
– టీఎస్‌పీఎస్సీకి త్వరలో చైర్మెన్ నియామకం
– డిసెంబర్ 2024 వరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ
– మేడిగడ్డపై న్యాయ విచారణ
– కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తాం : అభయ హస్తం లోగో, పోస్టర్, ధరఖాస్తు ఫారం ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి
”మాది ప్రజా ప్రభుత్వం..ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం.. గడీల నుంచి పాలనను గ్రామాలకు తెచ్చాం..ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం..డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం… ప్రజలకు మంచి పాలన అందించడమే మా లక్ష్యం” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని తెలిపారు. ఈ నెల 8న రెండు గ్యారంటీల అమలును చేపట్టగా, మిగతా గ్యారంటీల ప్రక్రియకు బుధవారం నుంచి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ”నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం… సుదూర ప్రాంతాల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారు.. గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదు… అందుకు ప్రజావాణీలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే ఉదాహరణ.. గత సర్కార్ హాయంలో ప్రజలు తమ సమస్యలపై ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవి… కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోంది…ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు ఎంఆర్వో, మరో గ్రూపునకు ఎంపీడీవోను ఇన్‌చార్జిగా నియమించాం.. ప్రతీ అధికారి రోజుకు రెండు గ్రామాలను సందర్శించి గ్రామ సభల నిర్వహణను పర్యవేక్షిస్తారు.. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లు పెంచుతున్నాం… గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు స్వీకరించే సదుపాయాన్ని కల్పిస్తున్నాం.. జనవరి ఆరు తర్వాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు… గడువు తరువాత ఎంపీడీవో, ఎంఆర్వో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం… ఎవరూ ఆందోళన చెందొద్దు.. రేషన్ కార్డులు లేని వారి దరఖాస్తును కూడా స్వీకరిస్తాం…కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ… గ్రామ సభల్లో అన్ని రకాల దరఖా స్తులను స్వీకరిస్తాం… జనవరి 7 లోపు లబ్దిదారుల వివరాలను సేకరిస్తాం” అని సీఎం వివరించారు. మహాలక్ష్మి పథకంతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు త్వరలో ఆర్ధిక సహయం ప్రకటిస్తామని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై విచారణ కోనసాగుతోందని, దోషులెవరిని వదలబోమని హెచ్చరించారు. రైతు బంధుపై ఎలాంటి సీలింగ్ పెట్టే ఆలోచన ప్రస్తుతానికి లేదనీ, మంత్రి వర్గంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడతల వారీగా రైతు బంధు డబ్బులు జమ చేస్తూ వచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు గారు గారు చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్‌లను ఉద్దేశించి చురకలు అంటించారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర వాటా కోసం ప్రధానితో పాటు ఎవరినైనా కలవడానికి సిద్దంగా ఉన్నామనీ, తమకు బేషజాలు లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దివాళా తీయించిందని, దాన్ని అధిగమించేందుకు దుబారాను తగ్గించడంతో పాటు ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తామని తెలిపారు. మీడియా కోసం సచివాలయంలో ప్రత్యేక గదిని కేటాయిం చనున్నట్టు తెలిపారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ప్రకటించారు.
కేసీఆర్ కుటుంబం ప్రజల రక్తాన్ని దోచుకుంది
కేసీఆర్ కుటుంబం ప్రజల రక్తం పిండి ఆస్తులు సంపాదించిందని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే భవనాలను కూల్చి కమీషన్ల కోసం కొత్తవి కట్టారని దుయ్యబట్టారు. దాన్ని ఆస్తులు సష్టించడంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రజావాణిలో న్యాయం జరగలేదంటూ ఓ మహిళకు మాజీ మంత్రి కేటీఆర్ రూ.లక్ష అందించారని ప్రచారం చేసుకుంటున్నారనీ, అయితే ఆ మహిళకు లక్ష రూపాయలు ఇప్పించడంలో ప్రజావాణి విజయవంతమైందని సీఎం అన్నారు. కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లల్లో లక్ష రూపాయలే పంచారనీ, మిగతా డబ్బులు కక్కిస్తామని అన్నారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వం చుట్టూ షాడో టీంలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఓటమి జీర్ణించుకోలేక కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్, సైనిక్ స్కూల్ గురించి అడగని వినోద్ కుమార్ బుల్లెట్ ట్రైన్ గురించి మాకు నీతులు చెబుతున్నారని విమర్శించారు.
త్వరలో జాబ్ క్యాలెండర్
ఎన్నికల ముందు తెలంగాణ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారనీ, వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని పేర్కొన్నారు. చైర్మెన్, సభ్యుల నియామకం తరువాత ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. గ్రూప్-2 నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రజాపాలనకు నోడల్ అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల వారిగా నోడల్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌కు కె.నిర్మల, వరంగల్‌కు వాకాటి కరుణ, ఖమ్మంకు రఘునందన్ రావు, మహబూబ్ నగర్‌కు టికె.శ్రీదేవి, కరీంనగర్‌కు శ్రీదేవసేనను నియమించారు. రంగారెడ్డికి ఇ.శ్రీధర్, మెదక్‌కు ఎస్.సంగీత, అదిలాబాద్‌కు ఎం. ప్రశాంతి, నల్గొండకు ఆర్‌వి. కర్నన్, నిజామాబాద్‌కు క్రిష్టినాకు బాద్యతలు అప్పగించారు. కాగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన కింద ధరఖాస్తులు స్వీకరించనున్నారని తెలిసిందే.