భీమ్‌గల్‌ ప్రాంతానికి ప్యాకేజీ-21 శ్రీరామ రక్ష..కప్పలవాగుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చాం.. 

– గల్ప్‌ కార్మికులకు కేసీఆర్‌ బీమా అండ కల్పిస్తాం..
– భీమ్‌గల్‌ మండలం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం..
 నవతెలంగాణ- భీంగల్
 భీంగల్ కప్పల బాబుకు కాలేశ్వరం నీళ్లు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిదని  ఈ ప్రాంత ప్రజలపై ముఖ్యమంత్రి ప్రేమ బలం  ఉన్నదని అందుకే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయ’ని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.   మండలంలోని సికింద్రాపూర్‌, సికింద్రాపూర్‌ తండా, గోన్‌గొప్పుల, గోన్‌గొప్పుల తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనపై ఉన్న ప్రేమ తన బాల్కొండ నియోజకవర్గానికి ప్రత్యేక బలమన్నారు. మున్ముందు ఇదే ప్రేమతో కేసీఆర్ ద్వారా మరెన్నో అభివృద్ధి పనులు జరగడం ఖాయమన్నారు. ‘కేసీఆర్‌ ప్రేమ, సహకారం వల్లనే నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనులూ ఆగలేదు.. ఇక ముందు కూడా ఆగబోవు..’అని ఆయన స్పష్టం చేశారు. భీమ్‌గల్‌ ప్రాంతంలో గత పాలకులు సాగునీటి పరంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్నారు. తనకంటే ముందు వారు భీమ్‌గల్‌కు తాగునీటి వనరులను సృష్టించడంలో కనీసం ఆలోచనలు కూడా చేయలేకపోయారన్నారు. తాను వచ్చాక భీమ్‌గల్‌ ప్రాంతం మొత్తానికి శాశ్వతంగా ఉపయోగపడేలా ప్యాకేజీ-21 పథకాన్ని తీసుకొచ్చానన్నారు. కేసీఆర్‌కు భీమ్‌గల్‌ ప్రాంత సాగునీటి ఇబ్బందులను ప్రత్యేకంగా వివరించామని గుర్తు చేశారు. అందుకే ప్యాకేజీ -21లో అంతకు ముందు ఉన్న డిజైన్‌లో కాలువ ద్వారా నీరు అందించాలని ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా  విన్నవించడంతో అంచనా వ్యయం పెరిగినా వెనక్కి తగ్గకుండా పైప్‌లైన్‌ మంజూరు ఇచ్చిన విషయం తెలిసిందే అన్నారు. భీమ్‌గల్‌ ప్రాంతానికి ఈ ప్యాకేజీ -21 పథకమే శ్రీరామ రక్షఅని పునరుద్ఘాటించారు. ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ను బినోలా నుంచి సొరంగ కాలువ ద్వారా సారంగపూర్‌కుతరలించి అక్కడి నుంచి నిజాంసాగర్‌ కాలువ ద్వారా  మెంట్రాజ్ పల్లి పంప్‌హౌజ్‌కు లించి మెంట్రాజ్‌పల్లి నుంచి పైప్‌లైన్‌ ద్వారా కప్పలవాగులో కాళేశ్వరం జలాలను పోసి..పారించామని గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఆదుకోని విధంగా రూ. 5లక్షల కేసీఆర్‌ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. తీజ్ భవనాలను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గిరిజన తండాలకు బాల్కొండ నియోజకవర్గంలోనే సీఎం కేసీఆర్‌ను విన్నవించి మంజూరు చేయించానన్నారు. రాష్ట్రంలో తీజ్‌ భవనానికి మంజూరీ అందుకున్న మొట్టమొదటి తండా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్‌ మండలం పెద్దమ్మకాడి తండాయేనని చెప్పారు. గోన్‌గొప్పుల, సికింద్రాపూర్‌ గ్రామాలకు చెక్‌డ్యాంలను నిర్మించి వాగుల వెంట భూములకు శాశ్వతంగా భూగర్భ జలాల భరోసా కల్పించానన్నారు. ఈ రెండు గ్రామాల్లో చెక్‌ డ్యాంల నిర్మాణం వల్ల బోరుబావులకు ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీటి సౌకర్యం ఉంటున్న విషయం ఇక్కడి రైతుల అనుభవంలో ఉందన్నారు. గోన్‌గొప్పుల గ్రామం గత ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోనే రెండవ అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామమని గుర్తు చేశారు. వారందించిన మెజారిటీ ప్రేమను గుర్తుంచుకుంటూ అడిగినవీ, అడగనివీ అన్ని పనులు చేసిపెట్టానన్నారు. రేకులపల్లి, బీరప్ప రోడ్లను చేయిస్తానన్నారు.లో లెవల్‌ కాజ్‌వేను సౌకర్యవంతంగా మార్పు చేయిస్తానన్నారు. ఈ గ్రామాలకు డెబ్బై ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ వాళ్లు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి నల్లా పెట్టి బిందెడు నీళ్ల కోసం మహిళలు పడుతన్న తిప్పలను తీర్చి వేశామన్నారు. బీఆరెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంటు సమస్యలు తొలిగిపోయాయన్నారు. విపక్షాలు ప్రతి ఇంట్లో ఇద్దరికీ పింఛన్‌ ఇస్తామని పచ్చి అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వారు పాలిస్తున్న కర్ణాటక, మహారాష్ట్రలో  ఇంటికి ఒక్క పించనే దిక్కులేదు.. కానీ ఇక్కడ రెండు పించన్లని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలా ఎంతో అభివృద్ధి, ఎన్నో కావని అనుకున్న పనులను కూడా చేయించిన కారు గుర్తు పార్టీకి ఓటు వేసి మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజా సేవలకు అంకితమై రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. ప్రతీ ఒక్కరికీ పూర్తి రుణమాఫీ అందుతుందని స్పష్టం చేశారు. రెండు గ్రామాల్లో మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. గొల్ల కుర్మలు గొర్రెపిల్లను మంత్రికి బహుకరించారు.