రావణ రాజ్యాన్ని భూస్థాపితం చేశాం.. ఇక రాబోయే రోజుల్లో రామరాజ్యం

– జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం
నవతెలంగాణ – ముత్తారం
రావణ రాజ్యాన్ని భూస్థాపితం చేశామని, ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పాలనతో రామరాజ్యం స్థాపిస్తామని జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్‌ రావు, ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవివ్వాసం నెగ్గిన అనంతరం వారు సింగల్‌ విండో డైరెక్టర్లతో కలిసి మాట్లాడారు. సింగల్‌ విండోలో జరిగిన అవినీతి కారణంగానే డైరెక్టర్లు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మాణం పెట్టారని, మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాసానికి మద్ధతు పలకడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై అవిశ్వాసం నెగ్గిందని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒంటెద్దు పోకడలతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ నియంతలా వ్యవహరించారని, దీంతో డైరెక్టర్లు వారిపై అవిశ్వాసం పెట్టారని తెలిపారు. తాత్కలికంగా సింగల్‌ విండో చైర్‌ పర్సన్‌గా మద్దెల వెంకట లక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా గోవర్ధన్‌కు బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో నియంత కెసిఆర్‌ను గద్దె దింపామని అన్నారు. చైతన్యవంతులైన మంథని నియోజక వర్గ ప్రజలు అవినీతి పాలనకు చరమగీతం పాడి, ఎలాంటి మాయ మాటలకు మోసపోకుండా శ్రీధర్‌బాబుకు మరోసారి భారీ మెజారిటీతో పట్టం గట్టారని, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్‌ అధిష్టానం కీలక మంత్రిత్వ శాఖ ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాలు అప్పగించిందని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో మంథని నియోజక వర్గంతోపాటు ఆయనకు అప్పగించిన వివిధ శాఖల్లో మంత్రి హోదాలోసమర్ధవంతంగా పని చేస్తున్నారని, ఇటీవల ఐటిలో విదేశీ పెట్టుబడులే ఇందుకు నిదర్శనమని ఊదహరించారు. మంథని నియోజక వర్గ అభివృద్ధి కోసం మంత్రి శ్రీధర్‌ బాబు నాయకత్వంలో కాంగ్రెస్‌ యువ నాయకుడు శ్రీనుబాబు సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో మండల యువజన సంఘం అధ్యక్షుడు బియ్యాని శివకుమార్‌, మండల మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు వాజీద్‌ పాషా, మంథనిమీడియా కన్వీనర్ ఇనుముల సతీష్ ,కౌన్సిలర్ సీపతీ బానయ్య, కాంగ్రెస్ యువ నాయకుడు ఆర్ల నాగరాజు, సీనియర్‌ నాయకులు బుచ్చం రావు, గాదం శ్రీనివాస్‌, తూటి రఫీ, తాటిపాముల శంకర్‌, మాజీ సర్పంచ్‌ పులిపాక నగేష్‌, కోల విజయ్‌,  గూట్ల రవీందర్‌, బియ్యాని రాజబాబు తదితరులున్నారు.