వికలాంగులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు దోహదపడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై వివక్ష చూపుతున్నాయి. రాష్ట్రంలో 21 రకాల వైకల్యాలతో బాధపడుతున్న వికలాంగుల సంక్షేమానికి మొక్కుబడి కేటాయింపులు తప్ప మేలు చేసింది లేదు. వికలాంగుల చట్టాలు అమలుకు నోచట్లేదు. వివిధ సంక్షేమ పథకాల్లో ఐదు శాతం వాటా దక్కట్లేదు. విద్య, వైద్య సదుపాయాల్లేవు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సైతం లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇతరుల కంటే వికలాంగులకు ఏదో ఒక వైకల్యం ఉండొచ్చు కానీ..! ఓటు విషయంలో మాత్రం అందరితో సమానులే..!! పాలక పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో వికలాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి ప్రస్తావనా చేయలేదు. అన్ని రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలో వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక డిక్లరేషన్ చేయాలని వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలో శారీరక, మానసిక వైకల్యం, లాకోమోటో, కుష్టు వ్యాధి, పక్షవాతం, మరుగుజ్జు, కండరాల బలహీనత, యాసిడ్ అటాక్, కనుచూపు లేకపోవడం, అంధత్వం, చెవిటి, వినికిడి లోపం, భాషా వైకల్యం, మానసిక ప్రవర్తనా లోపం వంటి 43.04 లక్షల మంది వికలాంగులున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 83 రకాల పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నా అవి రికార్డుల్లో తప్ప ఆచరణలో వికలాంగులకు అందుతున్నది లేదు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్, వీల్‌చైర్స్ పంపిణీ తప్ప ఆర్థిక స్వావలంబన సాధించేందుకు దోహదపడే పథకాలేవీ అమలు చేయట్లేదు.
అందని ద్రాక్షలా పథకాలు
కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో 83 రకాల పథకాలు వికలాంగుల కోసం అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే దీన్ దయాళ్ పునరావాస పథకం ద్వారా రాష్ట్రంలో 3291 మంది వికలాంగులు మాత్రమే లబ్ది పొందుతున్నారు. లక్షలాది మంది వికలాంగులుంటే ఐదు వేల మందికే వీల్ చైర్స్ పంచారు. 10 లక్షల మంది వికలాంగులకు ఫిజియోథెరఫీ, స్పీచ్ థెరఫీ, బిహేవియర్ థెరపీ అవసరముంది. మరో పది లక్షల మందికి వైద్యపరమైన సౌకర్యాలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ పెరుగుతున్న ధరలు, అవసరాలకు సరిపడట్లేదు. కనీసం రూ.10 వేలకు పింఛన్ పెంచాలని పోరాడుతున్నారు. అదాయ పరిమితి విధించే జీవో 17ను రద్దు చేయాలని పోరాడుతున్నారు. వికలాంగులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలం టున్నారు. వికలాంగుల స్వయం ఉపాధి కోసం దళిత, బీసీ, మైనార్టీ బంధు మాదిరే వికలాంగ బంధు పథకం పెట్టాలని, అంత్యోదయ రేషన్కార్డులిచ్చి రేషన్ పాసుల ద్వారా నిత్యావసర సరుకులివ్వాలని, డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి పథకాల్లో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలని కోరుతున్నారు. ఇంటి స్థలమున్న వాళ్లకు ఇల్లు నిర్మించాలని, స్థలాలేనోళ్లకు 120 గజాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం
వికలాంగ హక్కుల పరిరక్షణ చట్టం 2016 సెక్షన్ 79 ప్రకారం వికలాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. చైర్మెన్, సభ్యుల్ని నియమించాలి. అదే విధంగా వికలాంగులపై జరిగే వివక్షను అరికట్టాలి. దోపిడీకి గురైనా, వేధింపులు, వివక్షపూరితంగా వ్యవహరించినా రక్షణ కల్పించాలి. యాసిడ్ దాడులకు గురవుతున్న మహిళలూ వికలాంగులవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే విషయంలో చూపుతున్న శ్రద్ద వాటిని అమలు చేయడంలో చూపట్లేదని వికలాంగుల హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.
ప్రత్యేక డిక్లరేషన్ చేయాలి
ఎన్నికల మ్యానిఫెస్టో అంటే వికలాంగులకు ఆసరా పింఛన్లు తప్ప మరేమీ లేదన్నట్టుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పింఛన్ అనేది బిక్షలా భావిస్తున్నాయి తప్ప నిస్సహాయులైన వికలాంగుల హక్కు అని పాలక పార్టీలు గుర్తించని దుస్థితి ఉంది. ఆసరా పింఛన్లు మాత్రమే వికలాంగుల జీవితాల్ని మారుస్తాయనే భ్రమల్లో పార్టీలున్నాయి. నిరుద్యోగ వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. స్వయం ఉపాధి కోసం వంద శాతం సబ్సిడీతో రుణ సదుపాయం కల్పించాలి. ఆర్థిక స్వాలంబన సాధించేందుకు వికలాంగులకు అవసరమైన బబ్జెట్ను కేటాయించాలి. వికలాంగులం దరికీ విద్యా అవకాశాలు అందేలా ప్రతి నియోజక వర్గానికో వికలాంగుల కోసం ప్రత్యేక స్కూల్, హాస్టల్ ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో వికలాంగులకు 5 శాతం ప్రత్యేక కోటా ఇచ్చి అందజేయాలి. వికలాంగుల వివాహా ప్రోత్సాహాన్ని రూ.2.50 లక్షలకు పెంచాలి. వికలాంగు లపై జరుగుతున్న వేధిం పులు అరికట్టేందుకు ప్రత్యేక చట్టం చేయాలి. హైదరాబాద్, జిల్లా కేంద్రా ల్లో వికలాంగుల భవనాల కోసం స్థలాలు కేటాయించాలి. ఇలాంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో వికలాంగుల కోసం ప్రత్యేక డిక్లరేషన్ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు.