– రేవంత్ రెడ్డినీ కొన్ని రోజులు చూస్తాం : పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశామనీ, సీఎం రేవంత్ రెడ్డిని కూడా కొన్ని రోజులు చూస్తామని బీఆర్‌ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. సీఎంగా ఎవరున్నా …బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దౌర్భాగ్యపు మాటలు, అబద్ధపు ప్రచారాలు, గ్యారంటీలపై నోరెత్తని సీఎం దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన బీజేపీ వల్లే…. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు అని అంటే దానికీ రేవంత్ వక్రభాష్యం చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ కూల్చబోతున్నదంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని సిగ్గు లేకుండా రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ భూముల అన్యాక్రాంతం
– డాక్టర్ చిరుమళ్ల రాకేష్ కుమార్
కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని బీఆర్‌ఎస్ నేత డాక్టర్ చిరుమళ్ల రాకేష్ కుమార్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నాంపల్లిలో వక్ఫ్ భూమిలో ఉన్న పెద్ద భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు కారు చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. ముస్లిం అనాథ పిల్లల కోసం కేసీఆర్ కష్టపడి నిర్మించిన అనీస్ ఉల్ గుర్భాను కాంగ్రెస్ ప్రభుత్వం వేరే అవసరాల కోసం వినియోగిస్తుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో చదరపు అడుగు స్థలాన్ని కేవలం రూ.5కే లీజు కు ఇచ్చారని చెప్పారు. మైనారిటీ విద్యా సంస్థలను అనీస్ ఉల్ గుర్భా ప్రాంగణానికి తరలించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. నిజాం కాలం నుంచి ఓ చరిత్ర ఉన్న ప్రదేశపు ప్రాధాన్యతను గుర్తించి అనాథల కోసమే ఆ భవనాన్ని కేటాయించి, లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాలంలో నిర్మించిన వాటిని దొంగలపాలు చేయొద్దని కోరారు. గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీలు ప్రజలు కాంగ్రెస్‌కి తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు.