– మావి ప్రాణాలు కావా? నష్టపరిహారం మాకొద్దా?
– తమకూ నష్టపరిహారం వర్తించేలా చూడాలని
– డీజీపీకి హోంగార్డుల విన్నపం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో విధి నిర్వహణలో మరణించిన, అంగవైకల్యానికి గురైన పోలీసులకు ఇచ్చే నష్టపరిహారాన్ని భారీగా పెంపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తమను విస్మరించడంపై హోంగార్డులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు వారి హోదాలను బట్టి కోటి రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు నష్టపరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ప్రకటించారు. అయితే, ఈ పెంపులో హోంగార్డులను చేర్చకపోవడంపై అక్కడే ఉన్న పలువురు హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల పిల్లల చదువులను పరిపుష్టం చేయడానికిగానూ కొత్తగా ప్రభుత్వం తెరుస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లలో హోంగార్డులు మొదలుకొని డీజీపీ వరకు వారి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం ప్రకటించడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమను నష్టపరిహారం పెంపులో భాగస్వామ్యం చేయకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికీ, పోలీసుల శాఖలో పరిమితమైన పనులకే హోంగార్డుల సేవలను వినియోగించుకుంటామని చేర్చుకున్నప్పటికీ దాదాపుగా కానిస్టేబుల్ చేసే విధులను వారితో చేయిస్తున్నారు. అంతేగాక, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతో పాటు ఐఎస్‌ఐ ప్రేరిత ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడంలోనూ, మాదకద్రవ్యాల నివారించడంలోనూ వారి సేవలను పోలీసు శాఖ వాడుకుంటున్నది. పోలీసులకు పెంచిన నష్టపరిహారాన్ని అన్ని రకాల పనులు చేస్తున్న తమకెందుకు వర్తింపజేయరని పలువురు హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఉన్నతాధికారులు పూనుకుని పోలీసుల అంత స్థాయిలో కాకున్నా..కొంత తక్కువైనా తమకు కూడా నష్టపరి హారం చెల్లించేలా ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.