– బీజేపీ నేత ఈటల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాల్లో అత్యధిక స్థానాలను తమ పార్టీనే గెలువబోతున్నదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఉత్తర తెలంగాణలో ఏడు స్థానాలు, హైదరాబాద్‌లో గోషామహల్ స్థానాన్ని గెలిచామని తెలిపారు. 2024 ఏప్రిల్‌లో జరిగే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని చెప్పారు. అన్ని వర్గాల వారూ తమ నాయకుడు అని చెప్పుకునే నేత ప్రధాని మోడీనే అన్నారు. వందేండ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నిర్మాణం త్వరలో పూర్తి కాబోతున్నదని తెలిపారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఎక్కడా ఏర్పాటు ఉద్యమాలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ మోడీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 స్థానాలు గెలిచేలా పనిచేయాలని అమిత్‌షా దిశానిర్దేశం చేశారన్నారు.