మనకు జబ్బు చేస్తే డాక్టరు దగ్గరకెళ్తాం. మందులు వాడతాం. మొన్న కరోనా వైరస్ విజృంభించి దాడి చేస్తే ప్రపంచమంతా వణికిపోయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకొందో.. ఆఖరుకు వ్యాక్సిను కనుగొని నివారించుకున్నాం. లెక్కలేనన్ని బాక్టీరియాలు, వైరస్‌లు నిత్యం మనపై దాడి చేయటం, వాటిని తరిమి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఒక జీవన పోరాటం. ఇవన్నీ కూడా మనకు తెలిసి, కనపడుతూన్న శత్రు దాడులు. అందుకే అరికట్టే ఆయుధాలను సమకూర్చుకుంటాము. కానీ కనపడకుండా మన మనసుపై, శరీరంపై దాడి చేస్తూ భవిష్యత్తునంతా చిద్రం చేస్తున్న వైరస్సు మన ఆహ్వానం మేరకే వచ్చి తన ప్రతాపాన్ని చూపెడుతున్నది. అదే సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా). ఇది వైరస్ కన్నా ప్రమాదకరమైనదే. కొన్ని తరాలనే నిర్వీర్యులను చేస్తున్నది. నిస్సత్తువకూ, మానసిక దౌర్భల్యానికి గురిచేస్తున్నది. మిత్రునిలా దరిచేరి, శత్రువులా కబళిస్తున్నది.
అది గమనించిన ఆస్ట్రేలియా సర్కారు, ప్రపంచంలోనే మొట్టమొదటిగా మేల్కొన్నది. వారి పార్లమెంటు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని పదహారు ఏండ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ ఒక బిల్లును ఆమోదించింది. ఇదొక సాహసోపేతమైన చర్యనే. పిల్లల వయసుకు సంబంధించి సోషల్ మీడియా వేదికలు హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచించింది. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, రెడిట్ మొదలైన అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు ఈ నిషేధం వర్తిస్తుందనీ పేర్కొంది. అయితే ఈ నిషేధిత జాబితాలో యూట్యూబ్‌ను మినహాయించింది. వయసు నిబంధన కఠినంగా అమలుపరచాలనీ, సోషల్ మీడియాలో పిల్లలు ఖాతాలు ఆరంభించకుండా నిరోధించకపోతే, సంబంధిత వేదికలకు 280 కోట్లు జరిమానాగా విధించుతారని చట్టం పేర్కొంది. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనేసే మాట్లాడుతూ, విపరీతంగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న కారణంగా పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం చాలా ప్రభావితమవుతోందని, అందువల్లనే ఈ నిషేధ చట్టం తెచ్చామని తెలపడం, మనమంతా కూడా ఆలోచించాల్సిన విషయం.
చేతిలోకి సెల్‌ఫోన్లు వచ్చాక వివిధ సోషల్ మీడియా వేదికలు అనేకానేక చర్చలకు, అవాస్తవ, అశాస్త్రీయ, భ్రమాత్మక విషయాలకు వేదికగా మారిపోయాయి. ముఖ్యంగా యువత, పిల్లలు వాటికి అలవాటుపడిపోయి, ఇంకే విషయాలనూ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, పనులను, సమస్యలనూ పట్టించుకోకుండా పోయింది. మొత్తం 24 గంటల్లో అనేక గంటలు ముఖాన్ని కదలకుండా స్క్రీన్‌పై పెట్టడం, వేళ్లతో చాటింగ్‌లూ చేయటంలోనే మునిగిపోవటంవల్ల, శారీరకమైన రుగ్మతలు తలెత్తుతున్నాయి. అనవసరమైన, ఎందుకూ పనికిరాని చెత్తంతా మెదళ్ళపై చేరుతున్నది. ఇప్పటికే పిల్లలు ఘోరమైన గేమ్స్ వీడియోలు చూడటంవల్ల, వారి మానసిక పరిస్థితి హింసాత్మకంగా స్పందనా రహితంగా మారుతోందని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు. చూపు మందగిస్తోంది. శారీరక కదలికలు, ఆటలు కరువై ఎదుగుదల కూడా ఆగిపోతున్నది. అంతేకాక సోషల్ మీడియాలో వచ్చే విషయాలు, సమాచారమే వాస్తవమైనదని భావించి అనేక అపోహలకు గురవుతున్నారు. ఇది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక చూడటం అలవాటయిన తర్వాత చూడకుండా ఉండలేనితనం పెరిగింది. అందుకనే పిల్లలు సెల్‌ఫోన్ల కోసం, యాప్‌ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మానసిక రోగులుగా మారిపోతున్నారు. ఒంటరులవుతున్నారు. దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారు.
పిల్లలను చైతన్యరహితులుగా, నిస్తేజులుగా తయారు చేయటమే కాకుండా, మానసిక అనారోగ్యానికి గురిచేస్తున్న, శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్న ఈ సోషల్ మీడియాను 16 ఏండ్లలోపు పిల్లలకు దూరంగా ఉంచడం చాలా అవసరమైన చర్య. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్ తరాలకు, వారి క్షేమానికి సంబంధించినది. ఆస్ట్రేలియా దేశం చేసినట్టుగానే మన దేశమూ చేయాలి. తల్లిదండ్రులు ఈ విషయమై ఆలోచించి ప్రభుత్వాల ముందుకు నిషేధ డిమండును తీసుకురావాల్సి ఉంది. ప్రభుత్వాలూ భావితరాల బాగుకోసం బాధ్యతగా ఆలోచన చేయాలి.